నల్గొండ, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ, మునుగోడు సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు పలువురు యువ నేతలు ఆసక్తి చూపుతున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన వారు ఇప్పటి నుంచే కార్యాచరణ స్టార్ట్ చేశారు. ఇందులో ప్రముఖంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు లీడర్లు నల్గొండ, మునుగోడు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. వరుసగా నాలుగుసార్లు నల్గొండ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసుత్తం భువనగిరి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా లేక ఎన్నికల టైంకు పార్టీ మారుతారా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ వెంకట్‌రెడ్డి పార్టీ మారితే ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేస్తారని బీజేపీలో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నల్గొండపైన ఆశలు పెట్టుకున్న మాదగో ని శ్రీనివాస్‌గౌడ్‌కు లైన్ క్లియర్ అవుతుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే టికెట్ కచ్చితంగా వస్తదన్న నమ్మకంతో శ్రీనివాస్‌గౌడ్ ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. పాదయాత్రలు, బైక్ ర్యాలీలంటూ పర్యటనలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నల్గొండ పట్టణంలో పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మాడ్గులపల్లి మండలంలో చేరికల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అమిత్ చూపు... మునుగోడు వైపు
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత నియోజకవర్గం మునుగోడుపైన గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్‌రెడ్డి గురి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి పోటీగా ఆయన బరిలోకి దిగుతారనే చర్చ జరుగుతోంది. తండ్రి సుఖేందర్‌రెడ్డి బాటలోనే అమిత్ కూడా నల్గొండ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం ఫస్ట్ నుంచి జరుగుతోంది. కానీ ఆయన ఎంపీ కన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నారని అనుచరులు అంటున్నారు. మునుగోడుతో సుఖేందర్‌రెడ్డికి బంధుత్వాలు, రాజకీయ సత్సంబంధాలు అమిత్‌కు కలిస్తొస్తాయన్న టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగా అమిత్ తాత గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండేళ్ల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి తర్వాత మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్
చేస్తున్నారు.
నల్గొండ బీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు
నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్ ప్రకటించారు. ఆర్‌కేఎస్ ఫౌండేషన్ పేరుతో విరాళాలు, ఆర్థికసాయాలు చేస్తున్న ఆయన ఎమ్మెల్యేకు పోటీగా నియోజకవర్గంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సపోర్ట్ కూడా తనకే ఉందని చెబుతూ బీసీ కోటాలో టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డ రామరాజు ఒక్కసారిగా ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం పార్టీలో కలకలం రేపింది.
ఇద్దరి మధ్య రాజకీయంగా నెలకొన్న మనస్పర్థలే అందుకు కారణమని అంటున్నారు. అయితే రామరాజుకు చెక్ పెట్టేందుకు ఆయనను పట్టణాధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు ఇటీవల జరిగాయి. కానీ కేటీఆర్ పర్యటన కారణంగా ఆ నిర్ణయం వాయిదా పడింది. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా పట్టణ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే ఇతర అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవచ్చని ఎమ్మెల్యే వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి అనుమతితో త్వరలోనే పార్టీలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు మరింత ముదిరితే అవి బీజేపీ కలిస్తొస్తాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.