ఫిబ్రవరి 7 నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 7 నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు
  • తిరుమల తరహాలో ఆలయంలో ఏడు ద్వారాలు

మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు:మహిమాన్విత క్షేత్రంగా మన్యంకొండ వేంకటేశ్వర ఆలయం విరాజిల్లుతోంది. పాలమూరు​ జిల్లా ​రూరల్​ మండలంలో వెలిసిన ఈ క్షేత్రంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు తిరుచ్చి సేవతో ఉత్సవాలను ప్రారంభం కానుండగా.. అదే రోజు కోటకదిర గ్రామంలోని అళహరి వంశస్తుల ఇంటి నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కొండమీదకు తీసుకురానున్నారు. 8న హంస వాహన సేవ, 9న గజ వాహన సేవ, 10న సూర్యప్రభ వాహన సేవ, 11న హనుమ వాహన సేవ, 12న గరుడ వాహన సేవ, అదే రోజు రాత్రి  ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

13న అశ్వవాహన సేవ, 14న దర్బారు సేవ, 15న శేషవాహన సేవ నిర్వహించనున్నారు. ఆ తర్వాత నెల రోజుల పాటు జాతర జరగనుంది. మార్చి 8న కొండ మీదకు చేర్చిన ఉత్సవ మూర్తులను తిరిగి కోటకదిరకు తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. మార్చి 12న అలివేలు మంగతయారు బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటి రోజు అంకురార్పణం చేస్తారు. 13న ధ్వజారోహణం, దేవతాహ్వానం, 14న అమ్మవారి తిరు కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహన సేవ, విమాన రథోత్సవం, 15న అశ్వవాహన సేవ, 16న పూర్ణాహుతి, వసంతోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. 

క్షేత్రం విశేషాలు..

మన్యంకొండలో లక్ష్మీ వేంకటేశ్వర స్వామి మూల విరాట్​ ఉండగా, మన్యంకొండ క్షేత్రం చుట్టూ పెద్ద రాతి గుట్టలు ఉన్నాయి. వీటిని హరిగిరులుగా పిలుస్తారు. పాలమూరు జిల్లా ప్రజలు ఈ స్వామిని ఇంటి దైవంగా కొలుస్తారు. అందుకే చాలా మంది వారికి పుట్టే మగ సంతానానికి మన్యంకొండగా నామకరణం చేస్తారు. క్షేత్రంలో తిరుపతిలో ఉన్నట్లే ఏడు ద్వారాలు ఉంటాయి. లక్ష్మీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ఏడు ద్వారాలు దాటాల్సి ఉంటుంది.

త్రేతాయుగంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఈ గుట్టల్లో తిరిగి మునుల ఆతిథ్యం స్వీకరించారని అందువల్ల ఈ క్షేత్రాన్ని రామకొండ అని కూడా పిలుస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా ప్రధాన ద్వారం పైభాగంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో సత్యనారాయణ స్వామి మండపం పురాతన నిర్మాణ పద్ధతిలో ఉంటుంది. ఇక్కడి క్షేత్రపాలకుడు వీరభద్రుడు. లక్ష్మీవరాహా స్వామి ఆలయం, వీరభద్ర ఆలయం, శివాలయం, గుట్ట కింద అలివేలు మంగతాయారు ఆలయాలు ఉన్నాయి. స్వామికి నిత్య పూజా కార్యక్రమాలకు జమ్మి, తులసి ఆకులను వినియోగిస్తారు. ఇక్కడ గర్భగుడి గుహ అంతర్భాగంగా ఉండి శేషసాయి ఆకారంలో ఉంటుంది. మూల విరాట్​​ శేషావతారంలో ఉంటుంది.

ఏర్పాట్లపై కలెక్టర్​ సమీక్ష..

మన్యంకొండ క్షేత్రాన్ని గురువారం సాయంత్రం కలెక్టర్​ విజయేందిర బోయి విజిట్  చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆఫీసర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. 12న రాత్రి రథోత్సవం సందర్భంగా కొండ పైకి ఫిట్​నెస్ ఉన్న  మినీ బస్సులు నిరంతరంగా నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున మెడికల్  క్యాంపులు, డాక్టర్లు, మందులు అందుబాటులో ఉంచాలని, విద్యుత్  అంతరాయం లేకుండా చూడాలని, జనరేటర్ అందుబాటులో ఉంచాలన్నారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో మద్యపానం  నిషేధించాలన్నారు. ఆర్అండ్​బీ, పంచాయతీ రాజ్, ఫుడ్​ ఇన్స్​పెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్​ వెంట అడిషనల్​ కలెక్టర్​ శివేంద్ర ప్రతాప్, ఏఎస్పీ రాములు, దేవాదాయ శాఖ అసిస్టెంట్  కమిషనర్  శ్రీనివాస రాజుఉన్నారు.