మారకపోతే చంపేస్తాం : మావోయిస్టు యాక్షన్ కమిటీ

ఏటూరునాగారం, వెలుగు : పోలీసు ఇన్​ఫార్మర్లుగా పనిచేస్తున్న ఏటూరునాగారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులతో పాటు ​చిన్నబోయినపల్లి, రామన్నగూడెం గ్రామాలకు చెందిన నాయకులు తమ పద్ధతులు మార్చుకోపోతే చంపేస్తామంటూ మావోయిస్టు యాక్షన్ కమిటీ భద్రు పేరుతో లెటర్ ​విడుదలైంది. ఏటూరునాగారం బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కూనూరు మహేశ్, లీడర్లు వలి బాబా, మెరుగు సత్యం, చిప్ప అశోక్, కాంగ్రెస్​ఎంపీటీసీ శ్రీలత భర్త గుడ్ల దేవేందర్, బీఆర్ఎస్ ఏటూరునాగారం టౌన్ అధ్యక్షుడు ఖాజా పాషా, సర్పంచ్ ఇసం రామ్మూర్తి, మాజీ ఎంపీపీ మాదరి రామయ్య,  మిన్నీ, రామన్నగూడెం ఎంపీటీసీ భర్త అల్లి శ్రీనివాస్,​ చిన్నబోయినపల్లికి చెందిన తుమ్మల లక్ష్మణ్ రెడ్డీ, కుమ్మరి సారయ్యల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

వీరు తమ పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని లెటర్​లో పేర్కొన్నారు. కానిస్టేబుల్ సుధాకర్ పీఎస్​కు వచ్చే అమాయక ప్రజల నుంచి వేలకు వేలు తీసుకుంటున్నాడని, ఇలాగే కొనసాగితే కానిస్టేబుల్ నాగయ్యకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. చిన్నబోయినపల్లి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుడ్డేటి రాజు పోలీస్ ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని, మారకపోతే కచ్చితంగా చంపుతామని హెచ్చరించారు. అడవిలో పోలీస్ కూంబింగ్​ఆపకపోతే బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుల నుంచి జిల్లా నాయకుల వరకూ ఎవరిని వదిలిపెట్టమని లెటర్​లో వార్నింగ్ ఇచ్చారు.