రాష్ట్రంలోకి మావోయిస్టు యాక్షన్‌‌ టీమ్‌‌లు..అప్రమత్తమైన పోలీసులు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో మావోయిస్టు యాక్షన్​ టీంలు ప్రవేశించాయనే వార్తలతో పోలీసులు అలర్ట్​అయ్యారు. డిసెంబర్ 2 నుంచి 8  వరకు పీఎల్‌జీఏ 22వ వార్షికోత్సవాలు ఛత్తీస్‌‌గఢ్‌‌ దండకారణ్యంలో జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కొత్త కమిటీ ఏర్పాటు అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతోపాటు మావోయిస్టు అగ్రనేతల ఆదేశాలతో చురుకుగా వ్యవహరించే నాలుగు యాక్షన్‌‌ టీమ్‌‌లు గోదావరి తీరం దాటి రాష్ట్రంలోకి ప్రవేశించినట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ అనిశ్చితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని, ఎలాగైనా పూర్వవైభవం సాధించాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఖాకీలు అలర్ట్‌‌ అయ్యారు. మావోయిస్టుల ఫోటోలతో వాల్​పోస్టర్లు ముద్రించి గోడలకు అంటించారు. మావోయిస్టుల ఆచూకీ తెలిపితే క్యాష్‌‌ రివార్డులు అందిస్తామని కొద్దిరోజులుగా సోషల్‌‌ మీడియాలో విస్త్రత ప్రచారం చేస్తున్నారు.  ఈ క్రమంలో గురువారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాష్ట్ర పోలీస్​బాస్​మహేందర్​ రెడ్డి పర్యటించడం ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ వారికి కీలక బాధ్యతలు

మావోయిస్టు పార్టీ ఇటీవల కేంద్ర కమిటీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అతి ముఖ్యమైన మావోయిస్టు ప్రతినిధులకు ఈ కమిటీలో అవకాశం కల్పించింది. కమిటీలో 20 మంది ఉండగా వీరిలో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టులే ఉన్నట్లు జాతీయ నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చాయి. అంతేకాకుండా ఆగస్టు నెలలో తెలంగాణ‒ఛత్తీస్‌‌ గఢ్‌‌ రాష్ట్ర సరిహద్దులలోని బీజాపూర్,- బస్తర్ జిల్లాల అడవులలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు వారం రోజులు నిర్వహించారు. వేలాది మంది మావోయిస్టులు పాల్గొన్న ఈ ప్లీనరీ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులంతా  పాల్గొన్నట్లు రాష్ట్ర పోలీసులకు పక్కా సమాచారం అందింది. కొత్త కేంద్ర కమిటీలో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారే కావడంతో  ఏదో విధంగా మన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో చత్తీస్‌గఢ్‌‌ రాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ జిల్లాల పరిధిలోని పోలీస్ స్టేషన్లను అలర్ట్‌‌ చేశారు. -మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు.

5 లక్షల నుంచి 20 లక్షల రివార్డ్‌‌

భూపాలపల్లి, ములుగు జిల్లాలలో మావోల అలజడిపై- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల ఎస్పీలు సురేందర్‌‌ రెడ్డి, సంగ్రామ్‌‌ సింగ్‌‌ జి.పాటిల్‌‌ ప్రకటించారు. మావోల సమాచారం ఇచ్చినవారికి  నగదు బహుమతి- అందిస్తామన్నారు. యాక్షన్ టీమ్ వాల్ పోస్టర్లను రిలీజ్‌‌ చేశారు.  నలుగురు సభ్యులు గల మావోయిస్ట్  యాక్షన్ టీం సభ్యుల వివరాలతో ఉన్న వాల్ పోస్టర్లను ప్రెస్ కు రిలీజ్ చేశారు. మావోయిస్టు యాక్షన్ టీం ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు నగదు బహుమతి అందిస్తామని, ఆచూకీ తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మావోయిస్టులు హింసాత్మక పద్ధతులతో సాధించేదేం ఉండదని, ఆయుధాలు వీడాలని పిలుపునిచ్చారు.  ప్రజల అభివృద్ధికి నిరోధకులుగా మావోలు మారారని అన్నారు. ఈ రెండు జిల్లాల పరిధిలోని అన్ని మండలాలతో పాటు గ్రామాల్లో మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యుల వాల్ పోస్టర్లు అతికించారు. మావో యాక్షన్ టీం సభ్యులు గాని  అనుమానాస్పద వ్యక్తులుగాని కనిపిస్తే ప్రజలు స్థానిక పోలీసులు లేదా డయల్ -100కు  సమాచారం ఇవ్వాలని ఎస్పీలు కోరారు. 

రెండు నెలల్లో రెండోసారి డీజీపీ పర్యటన

ఇంటెలిజెన్స్​ హెచ్చరికలతో రాష్ట్ర పోలీస్‌‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి డీజీపీ మహేందర్‌‌ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఛత్తీస్‌‌ గఢ్‌‌ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి గడిచిన రెండు నెలల్లోనే రెండుసార్లు వచ్చారు. ఇందులో భాగంగానే అక్టోబర్‌‌ 19న వెంకటాపురం మండలంలో పర్యటించిన డీజీపీ మళ్లీ 60 రోజులు తిరక్కముందే గురువారం కూడా ఇదే మండలంలో పర్యటించి పోలీసులను అప్రమత్తం చేశారు.- గత రెండు సంవత్సరాలలో మావోయిస్టులు చేసిన మేజర్ క్రైమ్ లు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోనే జరిగాయి. పోలీస్‌‌ ఇన్‌‌ఫార్మర్ల పేరుతో భీమేశ్వరరావు, రమేశ్, గోపాల్ ను హత్య చేశారు. ఈ మూడు సంఘటనలు అలుబాక పోలీస్ స్టేషన్ కు( గురువారం డీజీపీ పర్యటించిన ప్రాంతం) రెండు కిలోమీటర్ల దూరంలోనే జరిగాయి. 

రాష్ట్ర సరిహద్దుల్లో ప్రతిక్షణం నిఘా : డీజీపీ మహేందర్​రెడ్డి 

వెంకటాపురం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉంచడానికి పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తోందని డీజీపీ మహేందర్​రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రతిక్షణం నిఘా పెట్టామని, మావోయిస్టులు చొరబడకుండా స్థానిక ప్రజలతో మమేకమై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ ఆలుబాకలో అత్యాధునిక హంగులతో నిర్మించిన పోలీస్ క్యాంపును డీజీపీ గురువారం ప్రారంభించారు. హైదరాబాద్‌‌ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌‌లో వచ్చిన డీజీపీ ఇక్కడ పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ములుగు జిల్లా పోలీస్ ఆఫీసర్లు, జిల్లాలో పనిచేసే సీఆర్పిఎఫ్ ఆఫీసర్లు, సిబ్బందిని అభినందిస్తూ డీజీపీ రివార్డులు అందజేశారు. అనంతరం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని హేమచంద్రాపురంలో గల పోలీస్​ హెడ్​క్వార్టర్లో జిల్లాలోని పోలీస్​ అధికారులతో రివ్యూ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తూ వివిధ ఆపరేషన్లలో ప్రతిభ కనపర్చిన పోలీస్​ అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేశారు.