జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన భూపాలపల్లి, ములుగులలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకపోవడంతో ఎలక్షన్ ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని ఓ వైపు మావోయిస్టులు పిలుపునిచ్చారు. అయినా ప్రభుత్వ అధికారులు, ఎన్నికల కమిషన్ చొరవతో ఓటర్లు బారులు తీరారు. చాలా నిబ్బరంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం కామాన్ పల్లి పోలింగ్ స్టేషన్లో రెండు గంటల పాటు ఈవీఏం మొరాయించింది.
మహదేవపూర్ మండలం సూరారంలో 190వ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం మొరాయించింది. టేకుమట్ల మండలం కేంద్రంలోని 102 , రేగొండ మండలం రూపురెడ్డిపల్లిలో 255 బూత్ లో ఈవీఎంలు మొరాయించగా, ఓటర్లు అరగంట సేపు వేచిచూడాల్సి వచ్చింది. మహాముత్తారం మండలం ములుగుపల్లి, యామన్ పల్లి పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాడ్లు పనిచేయకపోవడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కొర్లకుంటలో ఈవీఎం మొరాయించడంతో కొత్త ఈవీఎంను అమర్చారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్ లో 196 బూత్ లో గగ్గూరు గణేశ్ అనే ఓటర్ పై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ స్టేషన్‌లోకి పొరపాటున సెల్‌ఫోన్ తీసుకెళ్లడంతో పోలీసులు ఓటర్ స్లిప్పు చింపేసి తన పట్ల దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ అతడికి కుటుంబానికి చెందిన 8 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండానే తిరిగి ఇంటికి వెల్లిపోయారు.