మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు నాగరాజు లొంగుబాటు

ములుగు, వెలుగు : నిషేధిత మావోయిస్టు పార్టీ వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ సభ్యుడు పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్  లొంగిపోయాడని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు. శనివారం జిల్లా పోలీస్  కార్యాలయంలో పునరావాసానికి సంబంధించిన రివార్డును నాగరాజుకు ఎస్పీ అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన లొంగుబాటు, పునరావాసం విధానంలో భాగంగా నాగరాజు మావోయిస్టుల సిద్ధాంతాలతో విసిగిపోయి పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిపారు.

.‘‘ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మెడికల్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు. సుధాకర్  అనే వ్యక్తి ప్రోద్బలంతో మావోయిస్టు పార్టీలో చేరాడు. కొద్ది రోజులకు మావోయిస్టు సిద్ధాంతంపై విసిగిపోయాడు.

మావోయిస్టు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలోని అమాయక ప్రజలను ఉపయోగించుకుంటున్నారని తెలుసుకొని పోలీసుల ఎదుట లొంగిపోయాడు” అని ఎస్పీ చెప్పారు. మావోయిస్టుల భావజాలానికి ఎవరూ ఆకర్షితులు కావద్దని ఎస్పీ సూచించారు.