చత్తీస్​గఢ్​లో మావోయిస్ట్ కమాండర్​ ఎన్​కౌంటర్

  • చత్తీస్​గఢ్​లో మావోయిస్ట్ కమాండర్​ ఎన్​కౌంటర్
  • హతమైన మద్దేడ్​ ఏరియా కమాండర్ ​నగేశ్
  • ఏకే 47 స్వాధీనంనగేశ్​పై రూ.8 లక్షల రివార్డు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్టు కమాండర్​ నగేశ్​ హతమయ్యాడు. బస్తర్​ఐజీ సుందర్​రాజ్.పి కథనం ప్రకారం...పక్కా సమాచారంతో బీజాపూర్​ నుంచి డీఆర్జీ, బస్తర్​ ఫైటర్స్, ఎస్టీఎఫ్​, సీఆర్పీఎఫ్​170 బెటాలియన్​ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్​కు వెళ్లారు. మద్దేడు పోలీస్​స్టేషన్​పరిధిలోని కోరంజెడ్​- బందెపార అడవుల్లో మావోయిస్టులు మద్దేడ్​ఏరియా కమాండర్​నగేశ్, ఏసీఎంలు బుచ్చన్న, విశ్వనాథ్ ఆధ్వర్యంలో 20 మంది మావోయిస్టులు సమావేశమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతాబలగాలను చూసి మావోయిస్టులు కాల్పులకు దిగారు. 

గంట సేపు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. తర్వాత కాల్పులు జరుపుకుంటూనే మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. తర్వాత అక్కడికి వెళ్లి చెక్​చేయగా ఒక మావోయిస్టు మృతదేహం కనిపించింది. లొంగిపోయిన నక్సల్స్, స్థానికుల ద్వారా మద్దేడు ఏరియా కమిటీ కమాండర్​ నగేశ్​​ మృతదేహంగా గుర్తించారు. ఏకే-47 ఆయుధం కూడా దొరికింది. మృతదేహంతో పాటు, ఇతర సామగ్రిని బీజాపూర్​స్టేషన్​కు తరలించారు. పారిపోయిన నక్సల్స్ కోసం అదనపు బలగాలను మద్దేడు అటవీ ప్రాంతానికి పంపించినట్లు ఐజీ సుందర్​రాజ్​వెల్లడించారు. హతమైన మావోయిస్టు కమాండర్​ నగేశ్​పై చత్తీస్​గఢ్​ సర్కారు రూ.8లక్షల రివార్డు ప్రకటించింది.