మావోయిస్ట్‌‌ దంపతుల అరెస్ట్‌‌.. డంప్‌‌ ఉందనే అనుమానంతో ఇల్లు ధ్వంసం

  • డంప్‌‌ ఉందనే అనుమానంతో మంచిర్యాల జిల్లా ఇందారంలో ఇల్లు ధ్వంసం

గోదావరిఖని/ మంచిర్యాల, వెలుగు  : నిషేధిత సీపీఐ మావోయిస్ట్‌‌  పార్టీ టెక్నికల్‌‌ విభాగానికి చెందిన సెంట్రల్‌‌ టీమ్‌‌  క్యాడర్‌‌  సభ్యులు డి.గంగాధరరావు (80) అలియాస్‌‌  నర్సన్న అలియాస్  బక్కన్న అలియాస్ వెంగో దాదా, అతని భార్య భవానీ (60) అలియాస్‌‌ సుజాత అలియాస్  శ్యామలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని  రామగుండం పోలీస్‌‌  కమిషనర్‌‌ రెమా రాజేశ్వరి తెలిపారు. శనివారం గోదావరిఖనిలోని రామగుండం కమిషనరేట్‌‌ ‌లో సీపీ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌‌ లోని అంబేద్కర్‌‌  కోనసీమ జిల్లా డెల్డా గన్నవరం మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన గంగాధరరావు 1969లో వైజాగ్‌‌  పాలిటెక్నిక్‌‌ కాలేజీలో చదివాడు. తర్వాత భవానిని వివాహం చేసుకున్నాడు. 1972లో జీవనోపాధి కోసం హైదరాబాద్‌‌కు వెళ్లి ప్రైవేటు ఆస్బెస్టాస్‌‌  తయారీ కంపెనీలో చేరి 1980 వరకు  పనిచేశాడు. ఆ సమయంలో మావోయిస్టు పార్టీ సిటీ కమిటీ ఆర్గనైజర్‌‌ విశ్వంతో ఏర్పడిన పరిచయం వల్ల మావోయిస్ట్‌‌ పార్టీలో  చేరాడు. అప్పటి నుంచి అండర్‌‌గ్రౌండ్‌‌లోకి వెళ్లి ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీదారుడిగా పనిచేశాడు. కాగా, మావోయిస్ట్‌‌  కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఆదేశాల మేరకు భార్య భావానీతో కలిసి పది నెలల క్రితం మంచిర్యాల జిల్లా జైపూర్‌‌  మండలం ఇందారం గ్రామానికి చేరుకున్నాడు. జల్లంపెల్లి బక్కయ్య, జల్లంపెల్లి లక్ష్మి పేర్లతో నకిలీ ఆధార్  కార్డులు, పాన్ కార్డులు తయారు చేసి, ఆ పేర్లతో ఇందారం గ్రామంలో స్థలం కొని చిన్న ఇల్లు నిర్మించుకున్నాడు. పలుమార్లు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సిరోంచకు వెళ్లి పార్టీ నేతలను కలిసి మీటింగ్‌‌లకు అటెండ్‌‌  అయ్యాడు.

గతంలో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌‌ లో కూడా మావోయిస్టు‌ కార్యకలాపాలు నిర్వహించాడు. కాగా, ఇందారం గ్రామంలో మావోయిస్ట్‌‌ పార్టీ మెంబర్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఇంటిని తనిఖీ చేసి మావోయిస్ట్‌‌  దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జైపూర్‌‌  పోలీస్‌‌ స్టేషన్‌‌లో కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ ఆధార్‌‌, పాన్‌‌ కార్డులు, బ్యాంక్  పాస్ బుక్ లు, రూ.1,57,900 నగదు, మొబైల్‌‌ ఫోన్లు, పెన్‌‌ డ్రైవ్‌‌, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. వారికి సహకరించిన మావోయిస్ట్  సానుభూతిపరుడైన పెద్దపల్లి జిల్లా కమాన్‌‌పూర్‌‌  మండలం పెంచికల్‌‌ పేట గ్రామానికి చెందిన చిప్పకుర్తి శ్రీనివాస్‌ ‌ పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. కాగా మావోయిస్టు‌ల డంప్‌‌  ఉందన్న అనుమానంతో ఇందారం గ్రామంలోని గంగాధర్‌‌రావు ఇంటిని పోలీసులు  కూల్చివేశారు.