
ములుగు, వెలుగు : మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, దివంగత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ భార్య, డివిజన్ కమిటీ సభ్యురాలు పుల్సం పద్మ అలియాస్ ఊరె అలియాస్ గంగక్క సోమవారం ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన పద్మ 1998లో సీపీఐఎంఎల్ పీడబ్ల్యూజీలో సభ్యురాలిగా చేరినట్లు తెలిపారు.
2001-– 04 వరకు మహిళా దళంలో పనిచేసి, 2005లో దళ కమాండల్‌గా నియమితురాలైందని, అదే ఏడాదిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్‌ను పెండ్లి చేసుకున్నట్లు చెప్పారు. 2007లో బదిలీపై దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లగా, అక్కడ ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొంది సుదర్శన్ రక్షణ విభాగంలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారన్నారు.
తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అనేక హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న పద్మ మూడుసార్లు ఎదురుకాల్పుల్లో సైతం పాల్గొందని చెప్పారు. 2024 జూలైలో బైక్ పైనుంచి పడడంతో ఎడమచేతికి తీవ్ర గాయమై ఆరోగ్య సమస్యలు పెరిగాయని, అందుకే లొంగిపోయిందని ఎస్పీ వివరించారు. అనంతరం పద్మకు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో ఓఎస్డీ గీతే మహేశ్ బాబాసాహెబ్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు