
- ప్రజలను బీఆర్ఎస్ దగా చేసింది
- దళితులకు మూడెకరాలేమైంది?
- ధరణి పేరుతో భూములు గుంజుకున్నరు
- బీజేపీతో అంతర్గత పొత్తు పెట్టుకుంది
- మావోయిస్టు జేఎండబ్ల్యూపీ కార్యదర్శి వెంకటేశ్
- ఎన్నికలు బహిష్కరించాలని పిలుపు
ఏటూరునాగారం, వెలుగు : బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి ఏరియా కార్యదర్శి వెంకటేశ్ బుధవారం ఓ ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నకొద్దీ పార్టీలన్నీ పోటీ పడి ప్రజలను మోసం చేయడానికి హామీలిస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్నంతకాలం అవినీతి చేసి ఇప్పుడు అవినీతి రహిత పాలకులమంటూ సిగ్గు లేకుండా ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల నుంచి అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలను దగా చేసిందన్నారు.
భూమి లేని దళితులకు మూడెకరాలు ఇస్తామని చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కి హరితహారం, యురేనియం, టైగర్జోన్పేరుతో వారిని వ్యవసాయ భూములు, అడవుల నుంచి గెంటివేసిందన్నారు. మరోపక్క కొద్దిమందికి మాత్రమే పోడు పట్టాలిచ్చి ఓట్లు పొందాలని చూస్తోందన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయిందన్నారు. కౌలు రైతులను అస్సలే పట్టించుకోలేదన్నారు.
ధరణి పోర్టల్ పేరుతో రైతుల భూములను...భూస్వాములు, బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నారన్నారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రైవేట్‌పరం చేసేందుకు పథకం పన్నారన్నారు. సింగరేణిని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ అణచివేస్తోందన్నారు. బీజేపీకి నిర్మాణ బలం లేకపోవడంతో బీఆర్ఎస్తో అంతర్గత పొత్తు కొనసాగిస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ కు కూడా అవసరం కాబట్టి చేతులు కలిపి నడుస్తున్నదని లెటర్లో పేర్కొన్నారు.