భీమదేవరపల్లి, వెలుగు: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కాసరవేణి రవి అలియాస్ వినయ్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. బెల్లంపల్లికి చెందిన రవి 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్ కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రవి డెడ్‌బాడీని ఆయన కుటుంబ సభ్యులు ఉంటున్న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా అమరుల బంధుమిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం, దళిత లిబరేషన్ ఫ్రంట్, విరసంతో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు రవి డెడ్‌బాడీపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి మాట్లాడుతూ ఆపరేషన్ కగార్‌లో భాగంగా డ్రోన్ల ద్వారా మావోయిస్టుల స్థావరాలను గుర్తించి కెమికల్స్ స్ర్పే చేస్తున్నారని, మావోయిస్టులు స్పృహ కోల్పోయిన తర్వాత ఎన్‌కౌంటర్ పేరుతో హతమారుస్తున్నారని ఆరోపించారు. అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర అంజమ్మ, పద్మకుమారి, శాంతమ్మ, శోభ, హుస్సేన్, మదన్‌కుమార్, విరసం జిల్లా కార్యదర్శి బాలసాని మధు పాల్గొన్నారు.