జార్ఖండ్​లో ఎన్​కౌంటర్​.. 8 మంది మావోయిస్టులు మృతి

జార్ఖండ్​లో ఎన్​కౌంటర్​.. 8 మంది మావోయిస్టులు మృతి
  •  
  • మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ
  • మాంఝీ తలపై కోటి రూపాయల రివార్డ్​

భద్రాచలం, వెలుగు: జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్​ మాంఝీ అలియాస్ వివేక్, అరవింద్ యాదవ్, సాహెబ్​రామ్ మాంఝీ ఉన్నారు. ప్రయాగ్ మాంఝీపై రూ.కోటి, మిగిలిన ఇద్దరిపై రూ.10 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి.బొకారో జిల్లాలోని జోగేశ్వర్ విహార్ పోలీస్​స్టేషన్ పరిధి పరస్పాడ్ అడవుల్లోని లుగు గుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు జార్ఖండ్ పోలీసులు, సీఆర్​పీఎఫ్ జవాన్లు కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అనతరం ఘటనాస్థలంలో ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలు, ఏకే 47, ఎస్​ఎల్ఆర్, ఇన్సాస్ వంటి 13 తుపాకులు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు, మందులు, విప్లవ సాహిత్యంను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మిగతా ఐదుగురు మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్​కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. 244 మందిని అరెస్ట్ చేశారు. వివిధ దళాల కమాండర్లతో పాటు 24 మంది లొంగిపోయారు.

నాలుగు రాష్ట్రాల్లో 100కు పైగా దాడులు

ఎదురుకాల్పుల్లో మరణించిన ప్రయాగ్​మాంఝీ అలియాస్ వివేక్ జార్ఖండ్, బీహార్, చత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన 100కు పైగా దాడుల్లో కీలక సూత్రధారి. జార్ఖండ్​లోని ఒక్క గిర్ది పోలీస్​స్టేషన్లోనే ఆయనపై 50 కేసులు ఉన్నాయి. మాఝీది జార్ఖండ్ రాష్ట్రం ధన్​బాద్ జిల్లా తుండీ పోలీస్​స్టేషన్ పరధిలోని దల్​బుడ గ్రామం. ప్రశాంత్​హిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మాంఝి ఇటీవల పరస్పాడ్ అడవుల్లోకి ప్రవేశించినట్లుగా నిఘావర్గాలు అలర్ట్ చేశాయి. అతని కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు. చివరకు సోమవారం ఎదురుకాల్పుల్లో ఆయన మరణించారు. మాంఝీ భార్య జయా ఏడాది క్రితమే పోలీసులకు పట్టుబడ్డారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం బయటకు వచ్చిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు.