
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో కొందరు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాల చేతిలో హతమైన వారిలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ తర్వాత సెర్చ్ ఆపరేషన్లో రేణుక డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నామని ధృవీకరించారు. అమెపై రూ. 45 లక్షలు రివార్డ్ (ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు మరియు తెలంగాణ ప్రభుత్వం రూ. 20 లక్షలు) ఉందని తెలిపారు.
రేణుక నేపథ్యం
ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత రేణుక అలియాస్ భానుది వరంగల్ జిల్లా జనగాంలోని దేవరుప్పుల మండలం కడివెండి గ్రామం. ఎల్ఎల్బీ చదివిన ఆమె..1996లో నక్సల్ సంస్థలో చేరి ఆంధ్రప్రదేశ్‌లోని SZCM కృష్ణ అన్నతో కలిసి పనిచేసింది. 2003లో DVCM పదోన్నతి పొందారు. 2006లో సౌత్ బస్తర్‌లో CCM దుల్లా దాదా అలియాస్ ఆనంద్‌తో కలిసి పనిచేశారు. 2013లో మాడ్ ప్రాంతానికి వచ్చి SZCM రామన్నతో కలిసి పనిచేశారు.
2020లో కరోనా కారణంగా రామన్న మరణించిన తర్వాత.. DKSZCM సెంట్రల్ రీజినల్ బ్యూరో (CRB) ప్రెస్ టీం ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. నక్సల్ సంస్థ తరపున పత్రికా ప్రకటనలను జారీ చేసేది రేణుక. ప్రభాత్, మహిళా మార్గం, అవామి జంగ్, పీపుల్స్ మార్చ్, పోడియారో పోల్లో, ఝంకార్, సంఘర్ష్టర్ మహిళా, పితురి, మిడంగూర్, భూమ్కల్ సందేశ్ వంటి వివిధ పత్రికలను ముద్రించి ప్రచురించేది. 2005లో సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) శంకమురి అప్పారావు అలియాస్ రవితో వివాహం జరిగింది.
అతను 2010 నల్లమల్ల ఎన్ కౌంటర్ (ఆంధ్రప్రదేశ్)లో మరణించాడు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు రేణుక. ఈ క్రమంలోనే తాజాగా దంతెవాడ-బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలలోని నెల్గోడ, ఇకెలి, బెల్నార్ గ్రామాల మధ్య ఉన్న అటవీ కొండలలో జరిగిన ఎన్ కౌంటర్లో సాయుధ బలగాల కాల్పుల్లో రేణుక మరణించారు. రేణుక మృతితో మావోయిస్టు పార్టీతో పాటు ఆమె స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ చేపట్టాయి. 2026, మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సాయుధ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే.. మావోయిస్టులకు పెట్టని కోట అయిన దండకారణ్యాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన మూడు నాలుగు నెలల్లో దాదాపు 200 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు సైతం ఉన్నారు. చలపతి, సుధాకర్, రేణుక వంటి అగ్ర నాయకుల మృతితో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.