
భద్రాచలం, వెలుగు : ఆగస్టు 15న బ్లాక్‌డేగా పాటించాలని మావోయిస్టు పార్టీ భద్రాద్రికొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మే 28న ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పుడు హోం మంత్రి అమిత్‌షా ఒక ఉపన్యాసం చేశారని, 1947 ఆగస్టు 14 రాత్రి బ్రిటన్వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అధికార మార్పిడికి నిదర్శనంగా రాజదండాన్ని జవహర్లాల్ నెహ్రూకు అందించారన్నారు.
రాజదండం అంటే రాజుల మధ్య జరిగే అధికార మార్పిడికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు. ఇక్కడ మళ్లీ రాజుల పాలనే నడుస్తోందని ఆరోపించారు. పార్లమెంట్లో రాజదండం ప్రతిష్ఠించి మణిపూర్ రాష్ట్రంలో ప్రజలను విభజించి మారణహోమాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆగస్టు15ను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.