కబ్జాలను అడ్డుకోకుంటే ప్రజాకోర్టులో శిక్షిస్తం

రాజకీయ నాయకులు తీరు మార్చుకోవాలి

లెటర్ ​రిలీజ్ ​చేసిన మావోయిస్టు పార్టీ

భద్రాచలం, వెలుగు : భూ కబ్జాదారుల నుంచి భద్రాచలాన్ని కాపాడాలని మావోయిస్టు పార్టీ భద్రాద్రికొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ మంగళవారం ఓ లెటర్ రిలీజ్ చేశారు. ఐటీడీఏ వెనుక ఉన్న సర్వే నంబర్ 111/5లోని చెరువును స్థానిక రెవెన్యూ, పోలీసుల సహకారంతో కాంగ్రెస్ లీడర్ బోగాల శ్రీనివాసరెడ్డి, టీడీపీ లీడర్ కొడాలి శ్రీనివాసరావు, సీపీఐ లీడర్ రావులపల్లి రాంప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసరావు కబ్జా చేశారని అందులో పేర్కొన్నారు. రాజుపేట కాలనీలోని క్రిస్టియన్ సంస్థలకు చెందిన సర్వే నంబర్లు 52/2, 52/46, 53/5/2లోని 3 ఎకరాల భూమిని, వాసిరెడ్డి దుర్గయ్య(ఎట్టపాక)కు చెందిన మరో 3 ఎకరాల భూమిని సీపీఐ నేత రావులపల్లి రాంప్రసాద్ అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపించారు.

లోకల్ ఎమ్మెల్యే అండతో, స్థానిక మంత్రి బంధువునని చెప్పుకుంటూ ఆదివాసీ సంఘాలపై ఒత్తిడి తెచ్చి భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. రాజకీయ పార్టీ లీడర్లు తమ తీరు మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. అక్రమార్కులకు వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.