
- కేంద్రానికి మావోయిస్టుల విజ్ఞప్తి
- శాంతి చర్చలకు రావాలని పిలుపు
- మావోయిస్ట్ ఇన్‌చార్జ్ రూపేశ్ పేరుతో ప్రెస్‌నోట్
- కేంద్రానికి మావోయిస్టుల విజ్ఞప్తి
- శాంతి చర్చలకు ముందుకురావాలని పిలుపు
- మావోయిస్ట్ ఇన్‌చార్జ్ రూపేశ్ పేరుతో ప్రెస్‌నోట్
జయశంకర్ భూపాలపల్లి/ వెంకటాపురం, వెలుగు: కర్రె గుట్టల్లో పోలీస్ ఆపరేషన్ నిలిపివేయాలని, నెల రోజులు కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు రావాలని కేంద్రానికి మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ బస్తర్ నార్త్-వెస్ట్ సబ్ జోనల్ ఇన్‌చార్జ్ రూపేశ్పేరుతో శుక్రవారం ప్రెస్‌నోట్ విడుదలైంది. ‘‘శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికోసం మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. శాంతి చర్చలకు సంబంధించి మా పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే లేఖలు రాసింది. విశ్వాస రాహిత్యాన్ని తొలగించేందుకు మా వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది.
శాంతి చర్చలకు అవకాశం ఉన్నప్పటికీ అణచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ఫలితంగా బీజాపూర్,- తెలంగాణ సరిహద్దులో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌ను వెంటనే ఆపాలి. బలగాలను ఉపసంహరించుకోవాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ మార్గం సానుకూల ఫలితాలను ఇస్తుంది. తుపాకీతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కగార్ సైనిక్ ప్రచారాన్ని నెల రోజుల పాటు వాయిదా వేయండి. మా విజ్ఞప్తికి ప్రభుత్వ సానుకూల స్పందన కోసం ఆశతో ఎదురుచూస్తాం!’’ అని అందులో ఉంది. కాగా, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో విస్తరించిన కర్రె గుట్టల్లో గత నాలుగు రోజులుగా భద్రతా బలగాలు ‘కర్రె గుట్టలు బచావో’ పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కర్రె గుట్టలను చుట్టుముట్టి తూటాల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది