మిగిలింది ఏడుగురే..! విప్లవోద్యమంలో మంచిర్యాల జిల్లా పోరు బిడ్డలు

 మిగిలింది ఏడుగురే..! విప్లవోద్యమంలో మంచిర్యాల జిల్లా పోరు బిడ్డలు
  • నాడు కోల్​బెల్ట్​ నుంచి పదుల సంఖ్యలో ప్రాతినిధ్యం
  • సెంట్రల్​కమిటీ స్థాయిలో కీలక బాధ్యతలు
  • ఎన్​కౌంటర్లు, లొంగుబాట్లతో తగ్గిన అన్నల సంఖ్య
  • మిగిలినవారి లొంగుబాటుపై పోలీసుల దృష్టి

మంచిర్యాల, వెలుగు: అప్పటి పీపుల్స్​ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీకి సింగరేణి కోల్​బెల్ట్​ఏరియా కంచుకోటగా ఉండేది. 1980, 90 దశకాల్లో బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్​ ప్రాంతాలకు చెందిన అనేక మంది యువతీయువకులు విప్లవోద్యమానికి ఆకర్షితులై అడవిబాట పట్టారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి అంచలంచెలుగా రాష్ట్ర, కేంద్ర కమిటీల స్థాయికి ఎదిగారు.

 సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ఉద్యమ బలోపేతానికి బాటలు వేశారు. మరోవైపు ఎన్​కౌంటర్లు, లొంగుబాట్లతో చాలామంది ఉద్యమానికి దూరమయ్యారు. ఒకప్పుడు కోల్​బెల్ట్ ఏరియా నుంచి 50 మందికి పైగా అన్నలు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య ఏడుకు చేరింది. మారిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల కారణంగా యువత మావోయిస్టు పార్టీ పట్ల ఆసక్తి చూపకపోవడంతో రిక్రూట్​మెంట్లు నిలిచిపోయాయి. దీంతో ఆనాటి అన్నల పేర్లే నేటికీ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. 

ఆ ఏడుగురు వీరే..

పోలీసుల రికార్డుల ప్రకారం ప్రస్తుత మంచిర్యాల జిల్లా నుంచి ఏడుగురు మాత్రమే మావోయిస్టు పార్టీలో మిగిలారు. 80, 90 దశకాల్లో పీపుల్స్​ వార్​లో చేరినవారిలో చాలామంది వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మందమర్రి ఫస్ట్ జోన్​కు చెందిన బండి ప్రకాశ్​అలియాస్​ బీపీ అలియాస్​ ప్రభాత్ కీలక నేతగా పోలీసుల దృష్టిలో ఉన్నారు.1987లో ఉద్యమంలో చేరిన ఆయన వయసు ఇప్పుడు దాదాపు 59 సంవత్సరాలు. కోల్​బెల్ట్ ఏరియాలో మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్​కమిటీ మెంబర్, స్టేట్ ​ప్రెస్ ​టీమ్​ ఇన్​చార్జి, సింగరేణి కోల్​బెల్ట్​ కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన సలాకుల సరోజ అలియాస్ ​దీప(55) స్టేట్​కమిటీ మెంబర్​గా కొనసాగుతున్నారు. 2007లో అరెస్టయిన ఆమె 2009లో తిరిగి ఉద్యమంలో చేరారు. ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్​ జోనల్​కమిటీ టెక్నికల్​టీమ్​ఇన్​చార్జిగా ఉన్నారు. అలాగే బెల్లంపల్లి శాంతిఖని బస్తీకి చెందిన ఆరెపల్లి కృష్ణ అలియాస్​కిష్టు(58)1999లో అండర్ ​గ్రౌండ్​కు వెళ్లారు. ఈయనపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ప్రస్తుతం ఎక్కడ, ఏ హోదాలో పనిచేస్తున్నారనే సమాచారం పోలీసుల దగ్గర కూడా లేదు. 

Also Read :- సమ్మర్​ యాక్షన్​ ప్లాన్

బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి పుష్ప అలియాస్ ​రాజేశ్వరి(52) 1999లో అడవిబాట పట్టారు. ప్రస్తుతం జిల్లా కమిటీ మెంబర్, మావోయిస్టు పార్టీ టెక్నికల్ ​టీమ్​లో ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన ఆమె భర్త జాడి వెంకటి అలియాస్​ బిమల్​1999లో అండర్​గ్రౌండ్​కు వెళ్లారు. 2007లో అరెస్టయ్యి 2009లో మళ్లీ తుపాకీ ఎత్తుకున్నారు. స్టేట్ కమిటీ మెంబర్, టెక్నికల్​ టీమ్​లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
మందమర్రికి చెందిన బబ్బెర రవిబాబు అలియాస్​ రవి 2006 నుంచి అండర్​గ్రౌండ్​లో ఉన్నారు. దండకారణ్యం స్పెషల్​ జోనల్​ కమిటీలో కొనసాగుతున్నారు. అలాగే కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లచ్చన్న అలియాస్​గోపన్న (64) 1983లో పీపుల్స్​వార్​లో చేరారు. జిల్లా కమిటీ మెంబర్​గా పనిచేశారు. ప్రస్తుతం దండకారణ్యంలో నార్త్ ​బస్తర్ ​డివిజన్ కమిటీ టెక్నికల్ ​డిపార్ట్​మెంట్​ ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. 

లొంగుబాటుపై పోలీసుల దృష్టి

మావోయిస్టు పార్టీలో మిగిలిన వారిని జనజీవనస్రవంతిలోకి తీసుకురావడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో లొంగుబాట్లను ప్రోత్సహిస్తూ.. దండకారణ్యంలో వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని జనారణ్యంలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. లొంగిపోతే వారిపై ఉన్న కేసులను ఎత్తివేయడంతో పాటు రివార్డు అందిస్తామని, అన్నివిధాలా అండగా ఉంటామని చెపుతున్నారు. రామగుండం పోలీస్​కమిషనర్ ఎం.శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్​ఆధ్వర్యంలో మావోయిస్టుల కుటుంబాలను కలుస్తున్నారు. వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారి తల్లిదండ్రులు, కుటుంబీకులకు నిత్యావసరాలు, మందులు అందిస్తున్నారు.

ఇటీవల బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు దంపతులు జాడి పుష్ప, వెంకటి దంపతుల తల్లి మల్లమ్మను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అంతకుముందు పలువురు మావోయిస్టుల కుటుంబాలను కలిసి పరామర్శించారు. దశాబ్దాల కాలంగా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నవాళ్లు విప్లవోద్య మాన్ని వీడి జనజీవనంలోకి వస్తారా? పోలీసుల ప్రయత్నం ఫలిస్తుందా? వేచిచూడాల్సిందే.