మావోయిస్టు రాష్ట్ర కమిటీ మెంబర్​తోట సీతారామయ్య అరెస్ట్

  • ఆయనతో పాటు పోలీసుల అదుపులో మరో  దళ సభ్యుడు
  • వివరాలు వెల్లడించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్​ తోట  సీతారామయ్యతో పాటు మరో దళ సభ్యుడు​ పి.రాజ్​కుమార్​ను అరెస్ట్​ చేసినట్టు ఎస్పీ వినీత్​ పేర్కొన్నారు.  గురువారం ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ..  చర్ల బస్టాండ్​ ప్రాంతంలో పోలీసులు 141 సీఆర్పీఎఫ్​ బెటాలియన్​ కలిసి నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వారిగా గుర్తించామని  తెలిపారు.  ఛత్తీస్​గఢ్​ మావోయిస్ట్​ పార్టీ ముఖ్యులను కలిసి తిరిగి హైదరాబాద్​కు వెళ్తుండగా చర్ల బస్టాండ్​ సెంటర్​లో అరెస్టు చేశామన్నారు.  

జిల్లాలోని అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామానికి చెందిన తోట సీతారామయ్య అలియాస్​ కృష్ణన్న అలియాస్​ సంజీవ్​ మావోయిస్టు పార్టీ స్టేట్​ కమిటీ మెంబర్​గా పనిచేస్తున్నారని తెలిపారు. 1982లో పీపుల్స్​వార్​ లో చేరారు. 2014  నుంచి స్టేట్ కమిటీ మెంబర్​గా ఉంటూ సెంట్రల్​ కమిటీ స్టాఫ్​గా పలువురు ముఖ్య నేతల వద్ద పనిచేశారని చెప్పారు. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని పలు పోలీస్​ స్టేషన్లలో  సీతారామయ్యపై  విధ్వంస ఘటనలు, హత్యలు, పోలీసులపై దాడులకు సంబంధించి పలు కేసులున్నాయన్నారు.  సీతారామయ్యపై తెలంగాణ గవర్నమెంట్​ రూ. 20లక్షల రివార్డు ప్రకటించిందన్నారు. 

మరో దళ సభ్యుడైన పాదం రాజ్​ కుమార్​ 2019 నుంచి మావోయిస్ట్​ పార్టీలో దళ సభ్యుడిగా పనిచేస్తున్నారన్నారు. పలు హత్యకేసులు, పోలీసులపై దాడులు, ప్రెషర్​ బాంబులు అమర్చడంతో పాటు 2021లో ఛత్తీస్​గఢ్​ సీఆర్​పీఎఫ్​ పోలీసులపై కాల్పులు జరిపి 24 మంది సీఆర్పీఎఫ్​ పోలీసులను చంపి, ఆయుధాలు లూటీ చేసిన ఘటనలో రాజ్​కుమార్​ ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి మావోయిస్టు సాహిత్యం, రివాల్వర్​, బుల్లెట్స్​, రూ. 3.40 లక్షలు నగదు, సెల్​ ఫోన్​లు, పెన్​ డ్రైవ్​ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.