ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాకలో జరిగింది ఎన్కౌంటర్కాదని, మావోయిస్టులకు విషం ఇచ్చి చిత్రహింసలు పెట్టి చంపారని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. గురువారం ఓ లేఖ విడుదల చేశారు. పోలీసులకు అప్రూవర్‌గా మారిన వ్యక్తి ద్వారా అన్నంలో విషం కలిపించి, ఏడుగురు దళ సభ్యులు తిన్నాక చిత్ర హింసలు పెట్టి దగ్గరనుంచి కాల్చి చంపారని పేర్కొన్నారు.
ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ ఈనెల 9న రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యాలయాలు, వ్యాపార సంస్థలు బంద్ పాటించి జయప్రదం చేయాలని లేఖలో కోరారు.
చల్పాక ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు పూర్తి బాధ్యత వహించాలని, న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్పొరేట్లకు కొమ్ముకాస్తు దోపిడీ విధానాలను అమలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ప్రభుత్వ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు.