
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన నిర్బంధ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది. ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నిషేధపు ఆంక్షలను ఎత్తివేసే వరకు విద్యార్థులంతా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికారిక ప్రతినిధి జగన్ ఒక లేఖ విడుదల చేశారు. యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేయకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 13వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ‘‘యూనివర్సిటీలో అభ్యుదయ, విప్లవ చైతన్యం కలిగిన విద్యార్థుల పోరాటాలను అణచివేయడానికి ప్రభుత్వం ఆందోళనలు, ధర్నాలను నిషేధించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి నిరంకుశత్వ చర్యలు దేశ భవిష్యత్తును నాశనం చేస్తాయి. యూనివర్సిటీ భూములను కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఒక పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగానే యూనివర్శిటీలో ఘోరమైన నిరంకుశ పాలన కొనసాగుతుంది. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారు. ప్రస్తుత పాలకుల విధానాలతో గతంలో కంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది" అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.