కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఆదివారం మావోయిస్టు పార్టీ ఇల్లందు -నర్సంపేట ఏరియా కమిటీ పేరిట వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. పీఎల్జీఏ 23వ వార్షికోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుందామని మావోలు ఆ వాల్ పోస్టర్లో పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్గ పోరాటాన్ని, గెరిల్లా యుద్దాన్ని తీవ్రం చేద్దామని, వర్గ శత్రువులను నిర్మూలిద్దామని, ప్రజా పునాదిని మరింత బలోపేతం చేద్దామని ఆ వాల్ పోస్టర్లలో మావోలు పేర్కొన్నారు. శత్రువు కొనసాగిస్తున్న సూరజ్‌కుండ్ వ్యూహాత్మక దాడిని తిప్పికొడదామని, విప్లవోద్యమాన్ని విస్తరింపచేస్తూ పురోగమిద్దామని కోరారు. కాగా, 15 రోజుల వ్యవధిలో కొత్తగూడలో రెండుసార్లు మావోల కరపత్రాలు, వాల్ పోస్టర్లు వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వాల్ పోస్టర్లను పోలీసులు తొలగించారు.