- చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఘటన
- ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తోందంటూ మహిళను హత్య చేసిన మావోయిస్టులు
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జీడీపల్లి బేస్‌క్యాంప్‌పై ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టులు దాడి చేశారు. ఈ క్యాంప్‌పై రెండు రోజుల క్రితమే దాడి చేసిన మావోయిస్టులు ఆదివారం మరోసారి దాడికి దిగారు. భారీ సంఖ్యలో వచ్చిన మావోయిస్టులు, పీఎల్‌జీఏ మిలీషియా సభ్యులు రాకెట్ లాంచర్లు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతాలబలగాలు తిరిగి కాల్పులు ప్రారంభించాయి. మావోయిస్టుల దాడిలో ముగ్గురు జవాన్లకు స్వల్పగాయాలయ్యాయి. పీఎల్‌జీఏ వారోత్సవాల టైంలో మావోయిస్టుల దూకుడు భద్రతాబలగాల్లో కలకలం రేపుతోంది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం బీజాపూర్, సుక్మా, దంతెవాడ, కాంకేర్, నారాయణపూర్ జిల్లాలకు అదనపు బలగాలను పంపుతోంది.
ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తోందంటూ మరో మహిళ హత్య
తెలంగాణ పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తోందంటూ మావోయిస్టులు ఓ ఆదివాసీ మహిళను హత్య చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ అంగన్‌వాడీ కార్యకర్తను హత్య చేసిన 24 గంటల్లోనే మరో మహిళను హత్య చేయడం కలకలం రేపుతోంది. మద్దేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని లోడేడు గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ యాలం సుక్రూ, ఆమె భర్త యాలం రామయ్యను శనివారం రాత్రి మావోయిస్టులు ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలోని అడవుల్లోకి తీసుకెళ్లారు.
అక్కడ రామయ్యను కర్రలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం సుక్రూ గొంతు నులిమి హత్య చేశారు. సుక్రూ 2017 నుంచి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తోందని, నాలుగు సార్లు హెచ్చరించినా తీరు మారలేదన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోవడానికి సుక్రూ ఇచ్చిన సమాచారమే కారణమని ఆరోపించారు.