శాంతి చర్చలకు మావోయిస్టుల సుముఖత.. ప్రజా ప్రయోజనాల కోసం చర్చలు జరగాలి

శాంతి చర్చలకు మావోయిస్టుల సుముఖత.. ప్రజా ప్రయోజనాల కోసం చర్చలు జరగాలి

ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పడిన శాంతి చర్చల కమిటీ చేసిన ప్రతిపాదనకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సానుకూలంగా స్పందించింది. ప్రజల ప్రయోజనాలను కేవలం సాయుధ పోరాటం ద్వారానే కాకుండా ఇతర శాంతియుత మార్గాల్లోనూ సాధించవచ్చని వారు స్పష్టం చేశారు. తీవ్రమైన పోరాటంలో చిక్కుకున్నా మావోయిస్టులు శాంతిచర్చలకు సిద్ధంగా ఉండడం వారి రాజకీయ పరిణతిని, ప్రజల పట్ల వారికున్న నిబద్ధతను తెలుపుతోంది. కేవలం ఆదివాసీల గురించే కాకుండా ఆదివాసీయేతర ప్రజల ప్రయోజనాల గురించి కూడా వారు ఆలోచిస్తున్నారు.

శాంతిచర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడితే, పాలకుల అభివృద్ధి నమూనా తెచ్చిన మారణహోమం, రాజ్యాంగ పాలనలో నెలకొన్న సామాజిక, సాంస్కృతిక ఆందోళనల గురించి కూడా చర్చించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మతపరమైన మైనారిటీలపై జరుగుతున్న వివక్ష, ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజల సాంస్కృతిక సంప్రదాయాల రక్షణ గురించి వారు గళం విప్పుతున్నారు.

పౌరుల ప్రాణాలకు అత్యంత విలువనిస్తూ మావోయిస్టులు శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేయడం వారి మానవత్వాన్ని చాటుతోంది. ఆరు రాష్ట్రాల్లో భీకర యుద్ధం కొనసాగుతున్నా, పౌర సమాజం హృదయపూర్వక పిలుపునకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వెంటనే స్పందించడం గమనార్హం. చర్చలతో తమకు లాభం చేకూరుతుందా లేదా అనే స్వార్థపూరిత ఆలోచనను పక్కనబెట్టి, శాంతి ప్రతిపాదన వచ్చినప్పుడల్లా మావోయిస్టులు సానుకూలంగా స్పందించడం వారి చిత్తశుద్ధిని, ప్రజలపట్ల వారికున్న బాధ్యతను తెలుపుతోంది. గతంలోనూ మావోయిస్టులు శాంతిచర్చలకు సానుకూలంగా స్పందించారు. 

2002, 2004లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో చర్చలు ఒక నిర్దిష్ట దశకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతిచర్చల ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు కూడా మావోయిస్టు పార్టీ దండకారణ్య కమిటీ సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం మాత్రం శాంతిచర్చల గురించి పైపై మాటలు చెబుతూనే 'ఆపరేషన్ కగార్'ను మరింత ఉధృతంగా కొనసాగించింది.

మొండి వైఖరి ఎందుకు?
మావోయిస్టుల నిర్మాణాత్మక ప్రకటనకు స్పందించిన చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ ప్రభుత్వం చర్చలకు సిద్ధమని పైకి ప్రకటించినా, మావోయిస్టులు మొదట లొంగిపోవాలనే పాత పల్లవిని మళ్లీ వినిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అదే మొండి వాదనను సమర్థిస్తున్నారు. మావోయిస్టులు లొంగిపోతే ఇక చర్చలు దేనికి? ప్రభుత్వ మొండి వైఖరిని దేశంలోని ప్రజాస్వామిక శక్తులు నిలదీయాల్సిన సమయం ఇది. మావోయిస్టు విధానాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ, వారు ప్రతి ఒక్కరూ అంగీకరించే శాంతిచర్చల ప్రతిపాదనను ప్రకటించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించేలా ప్రజాస్వామిక శక్తులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. భారత ప్రభుత్వం కండ్లు తెరిచి వాస్తవాన్ని గ్రహించాలి.  ప్రజల ప్రాణాల కంటే కార్పొరేట్ లాభాలు ముఖ్యం కాదని గుర్తించాలి. మావోయిస్టులను శాంతిచర్చలకు వెంటనే ఆహ్వానించాలి.  ‘అందరూ శాంతిని కోరుకుంటారు. కానీ, కొద్దిమంది మాత్రమే దానిని సాధించడానికి మార్గాన్ని అన్వేషిస్తారు’ అన్న బుద్ధుడి మాటలలోని ఆ కొద్దిమందిలో ప్రభుత్వం కూడా ఉండాలని ఆశిద్దాం.

మేకల ఎల్లయ్య, సీనియర్ జర్నలిస్ట్