- నారాయణ్‌పూర్ జిల్లా చోటే డాంగేర్ పీఎస్ పరిధిలో ఘటన
భద్రాచలం,వెలుగు : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బుధవారం దారి కాచి (అంబుష్) పెట్రోలింగ్చేస్తున్న సీఏఎఫ్ జవాన్‌ను మందుపాతర పేల్చి చంపారు. నారాయణ్‌పూర్ జిల్లా ఎస్పీ పుష్కర్‌శర్మ కథనం ప్రకారం...చత్తీస్‌గఢ్ 9వ బెటాలియన్ సీఏఎఫ్(చత్తీస్‌గఢ్ ఆర్ముడ్ ఫోర్స్)కు చెందిన జవాన్లు చోటే డాంగేర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్‌కు వెళ్లారు. నెకో ఇండస్ట్రీస్‌కు చెందిన ఆమ్దాయి ఐరన్ గనుల వద్ద వీరి రాకను గమనించిన మావోయిస్టులు రోడ్డుపై అంతకుముందే మందుపాతర అమర్చి వేచి చూస్తున్నారు.
కూంబింగ్ చేసుకుంటూ అతి సమీపంలోకి రాగానే మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముందు వరుసలో ఉన్న కమలేష్ సాహూ అనే జవాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. వినయ్‌కుమార్ అనే మరో కానిస్టేబుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతన్ని జగదల్పూర్ దవాఖానకు తరలించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్టు ఎస్పీ పుష్కర్ శర్మ తెలిపారు.