ఇన్​ఫార్మర్​ నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య

ఇన్​ఫార్మర్​ నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య
  • ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల ఘాతుకం

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలో మావోయిస్టులు ఇన్​ఫార్మర్ల పేరిట ఇద్దరు ఆదివాసీలను హత్య చేశారు. బీజాపూర్​ జిల్లా తెర్రం పోలీస్​స్టేషన్​ పరిధిలోని బుడిగిచేరు గ్రామానికి చెందిన కారం రాజు(32), మాడవి మున్నా(27)ను సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా సాయుధులైన 12 మంది మావోయిస్టులు తుపాకులతో బెదిరించి సమీప​అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి వారిని కత్తులతో పొడిచి చంపారు. 

అనంతరం వారి డెడ్​బాడీలను గ్రామ సమీపంలో పడేసి లేఖ వదిలి వెళ్లారు. దళాల కదలికలను పోలీసులకు చెబుతూ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్​ఫార్మర్లకు ఇలాంటి గతే పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. కాగా, బలగాలను పంపించి డెడ్ బాడీలను ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు బీజాపూర్​ ఏఎస్పీ చంద్రకాంత్​ గవర్నా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

మందుపాతర పేలి జవాన్లకు గాయాలు..

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కిరండోల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని పురంగేల్​ అటవీ ప్రాంతంలో మంగళవారం మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. 
సీఆర్పీఎఫ్​ 231 బెటాలియన్​కు చెందిన జవాన్లు కూంబింగ్​ నిర్వహిస్తుండగా, మందుపాతర పేలింది. ఈ ఘటనలో ప్రమోద్​కుమార్, విజయ్​కుమార్​ గాయపడ్డారు. ప్రమాద్​కుమార్​ కాలికి తీవ్ర గాయం కావడంతో ఆపరేషన్​ చేశారు. విజయ్​కుమార్​ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాయ్​పూర్​కు హెలీకాప్టర్​లో తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​ పి తెలిపారు.