వెంకటాపురం/భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్రాష్ట్రం నుంచి ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గ్రేహౌండ్స్ ప్రత్యేక బలగాలతో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు హిట్ లిస్ట్ లో ఉన్న నేతలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
వెంకటాపురం సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బృందం తెలంగాణ, చత్తీస్గఢ్సరిహద్దు సురవీడు గ్రామం వద్ద వెహికల్స్తనిఖీ చేపట్టారు. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల ఫోటోలతో కూడిన కరపత్రాలను చూపిస్తూ ప్రయాణికులను విచారిస్తున్నారు. యాక్షన్ టీం సభ్యులు, అపరిచిత వ్యక్తుల సంచారం తెలిస్తే 100, సర్కిల్ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
బస్సును కాల్చేసిన్రు
చత్తీస్‌గఢ్,- -మహారాష్ట్ర బోర్డర్లో ప్రైవేటు బస్సును మావోయిస్టులు తగలబెట్టారు. 20 నుంచి 25 మంది మావోయిస్టులు బస్సును ఆపి ప్యాసింజర్లను కిందకు దించి నిప్పు పెట్టారు. ప్యాసింజర్లు సేఫ్ గా ఉన్నట్లు నారాయణ్‌పూర్ ఎస్పీ వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా ఎటపల్లి తహశీల్ఫారెస్ట్ ఏరియాలో శనివారం ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సీ-60 బలగాలు కూంబింగ్జరుపుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడడంతో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. గంటకుపైగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.