మొక్కజొన్న రైతులకు లక్ష పరిహారం అందించాలంటూ మావోల లేఖ

ములుగు జిల్లా: రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ  హైబ్రిడ్ విత్తనాల కంపెనీలకు మావోయిస్టులు లేఖ రాశారు.  వెంకటాపురం వాజేడు ఏరియా కార్యదర్శి సుధాకర్  పేరుతో ఈ లేఖ విడుదలైంది. మొక్కజొన్న రైతులను మోసగిస్తున్న సింజంట , సిపి, పయనీర్, కావేరి, హైటెక్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడాలని లేఖలో మావోయిస్టులు పిలుపునిచ్చారు. లాభాల కోసం సొంత భూములు కలిగిన రైతులనే వ్యవసాయ కూలీలుగా మార్చారని మావోయిస్టులు ఆరోపించారు. ఏజెంట్లు తక్షణమే తమ మోసాలను మానుకోవాలని మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఏజెంట్లను హెచ్చరించారు.

గతేడాది నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.లక్ష నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని మావోయిస్టు నేత సుధాకర్ వార్నింగ్ ఇచ్చారు.