ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీలో చేరినందుకు ఓ గ్రామ మాజీ సర్పంచ్‌ను దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని వదిలేయాలని మృతుడి కూతురు వేడుకున్న మావోయిస్టులు కనికరం చూపలేదు. పోలీసుల వివరాల ప్రకారం.. భైరాంగఢ్ బ్లాక్‌లోని బిరయాభూమికి చెందిన మాజీ సర్పంచ్ సుక్లూ ఫర్సా బీజేపీలో కీలకంగా పని చేస్తున్నారు. బీజేపీలో ఉంటూ పోలీసుల ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని సుక్లూపై మావోయిస్టులు అనుమానం పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీని వీడాలని సుక్లూను మావోయిస్టులు హెచ్చరించారు. రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చిన సుక్లూ ఫర్సా బీజేపీని వీడకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నక్సలైట్లు అతడిని కిడ్నాప్ చేశారు. దీంతో తన తండ్రిని వదిలేయాలని సుక్లూ ఫర్సా మైనర్ కుమార్తె సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అయినప్పటికీ కనికరం చూపని మావోయిస్టులు సుక్లూ ఫర్సాను దారుణంగా హతమార్చారు. ఈ హత్యకు తామే బాధ్యులమని భైరాంగఢ్ ఏరియా కమిటీ మావోయిస్టులు ప్రకటించారు.
సంఘటనా స్థలంలో కరపత్రాలను కూడా వదలి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా పని చేస్తోన్న భద్రతా దళాలు.. గడచిన మూడు నెలల్లో ఒక్క ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోనే దాదాపు 100 మందికి పైగా నక్సలైట్లను హతమార్చిన విషయం తెలిసిందే. పోలీస్ ఇన్ ఫార్మర్లుగా పని చేస్తూ తమకు నష్టం చేస్తున్నారని మావోయిస్టులు పలువురిని కిడ్నాప్ చేసి చంపేస్తున్నారు.