![కాంగ్రెస్ సర్పంచ్ క్యాండిడేట్‌ను హత్య చేసిన మావోయిస్టులు](https://static.v6velugu.com/uploads/2025/02/maoists-killed-congress-sarpanch-candidate-joga-base-of-ratanpur-in-chhattisgarh_MlInto0mGP.jpg)
- చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అరన్‌పూర్‌లో ఘటన
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా అరన్‌పూర్ కాంగ్రెస్ సర్పంచ్ క్యాండిడేట్ జోగా బార్సేను గురువారం రాత్రి మావోయిస్టులు హత్య చేశారు. గతంలో సీపీఐ తరఫున పోటీ చేసిన జోగా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. 2000 నుంచి జోగా, అతని భార్యే అరన్‌పూర్ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన మావోయిస్టులు గురువారం రాత్రి భారీ సంఖ్యలో జోగా ఇంటికి చేరుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యుల ముందే గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనతో అరన్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
నలుగురు మావోయిస్టులు అరెస్ట్
భద్రాద్రి జిల్లా చర్ల పోలీసులు శుక్రవారం నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం... చర్ల పోలీసులు, సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ సిబ్బంది సంయుక్తంగా తాలిపేరు డ్యాం సమీపంలో శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ టైంలో అటుగా వచ్చిన నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.
వారిని చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పోలంపల్లి మావోయిస్ట్ వ్యవసాయ కమిటీ ఏసీఎం గట్టుపల్లి ఊర అలియాస్ సోమన్న, సుక్మా జిల్లా చింతలనార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొరపాల్ గ్రామానికి చెందిన జేగురుగొండ ఏరియా కమిటీ మెంబర్ మడకం ఉంగ, దంతెవాడ జిల్లా అలనార్ గ్రామానికి చెందిన జేగురుగొండ ఏరియా కమిటీ మెంబర్ కడితి లక్కే, సుక్మా జిల్లా గొండపల్లి గ్రామానికి చెందిన పామేడ్ ఏరియా కమిటీ మెంబర్ సోడె సుక్కిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 30 కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.