గ్రామ పటేల్​ను హత్య చేసిన మావోయిస్టులు

గ్రామ పటేల్​ను హత్య చేసిన మావోయిస్టులు

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు సోమవారం రాత్రి ఒక గ్రామ పటేల్​ను హత్య చేశారు. జిల్లాలోని చింతగుఫా పోలీస్​స్టేషన్​ పరిధిలోని పెంటపాడు గ్రామ పటేల్​ కల్ము హిడ్మా(65) ఇంట్లో నిద్రిస్తుండగా కుంట ఏరియా కమిటీకి చెందిన సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు తమ వెంట తీసుకెళ్లారు. ఊరి చివర అతడిని కత్తులతో గొంతు కోసి హత్య చేసి డెడ్ బాడీని వదిలివెళ్లారు. 

ఘటనా స్థలంలో కుంట ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీ పేరిట లేఖను విడిచివెళ్లారు. గ్రామంలో భూ దందాలకు పాల్పడుతున్నాడని, బలవంతంగా తన పేరిట పట్టాలు చేయించుకుంటున్నాడని లేఖలో పేర్కొన్నారు. పద్దతి మార్చుకోవాలని చెప్పినా వినకపోవడంతో హత్య చేస్తున్నట్లు తెలిపారు. సీపీఐ నేత మనీశ్​​కుంజాంకు మృతుడు మామ అవుతాడు. 

మావోయిస్టుల ఆరోపణలను మనీశ్​​కుంజాం ఖండించారు. పోస్టుమార్టం అనంతరం డెడ్​బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సుక్మా ఎస్పీ కిరణ్​ చౌహాన్​ తెలిపారు.