
- భద్రాద్రి జిల్లా చెన్నాపురంలో చంపేసిన మావోయిస్టులు
- మృతురాలు మావోయిస్టు మాజీ కమాండర్ నీల్సో అలియాస్ రాధ
- ఆమె విప్లవ ద్రోహి: ఏవోబీ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్
- తొమ్మిది రోజుల్లో ముగ్గురి హత్య
భద్రాచలం, వెలుగు: ఇన్ఫార్మర్ పేరిట ఓ మహిళను మావోయిస్టులు హత్య చేశారు. మృతురాలిని మావోయిస్టు పార్టీ మాజీ మహిళా కమాండర్ నీల్సో అలియాస్ రాధ (25)గా ప్రకటించారు. ఏవోబీ(ఆంధ్రా, ఒడిశా బోర్డర్)లో జోన్ మిలటరీ ఇన్‌స్ట్రక్టర్‌గా, నాయకత్వ రక్షణ దళ కమాండర్‌గా పనిచేస్తున్న ఆమెపై అనుమానం వచ్చి మూడు నెలల కిందట్నే పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ ఏవోబీ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఆధీనంలో ఉంచింది. విచారణ అనంతరం విప్లవ ద్రోహిగా పేర్కొంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురంలో బుధవారం మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటనపై గణేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. నీల్సో విప్లవ ద్రోహి అని, అందుకే చంపేశామని అందులో పేర్కొన్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి..
హైదరాబాద్‌లోని బాలాజీనగర్‌కు చెందిన బంటి రాధ ఇంటర్ తర్వాత డిప్లమా ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ (డీఎంఎల్టీ) చదివింది. 2018లో మావోయిస్టు పార్టీలో చేరింది. పలువురు కేంద్ర కమిటీ సభ్యులకు ఆమె వైద్యం అందించేది. 2018లోనే రాధ తల్లి.. తన కుమార్తె కనిపించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దబయలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. కాగా మూడు నెలల కిందట మావోయిస్టు పార్టీ నీల్సో అలియాస్ రాధపై నిఘా పెట్టింది. పోలీసు ఇన్ఫార్మర్ పేరుతో బుధవారం హత్య చేశారు.
ఏవోబీ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ విడుదల చేసిన లేఖలో.. ‘‘ఆంధ్రా, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ పోలీసులు రాధను ఇన్ఫార్మర్గా మార్చుకున్నారు. తొలుత ఆమె సోదరుడు సూర్యంను మచ్చిక చేసుకుని ఉద్యోగం ఇచ్చి జీతం, విలాసవంతమైన సౌకర్యాలు కల్పించారు. మరో ముగ్గురితో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీ సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాధ ఫోన్ నంబర్‌ను తెలుసుకుని ఆమె స్నేహితురాలి ద్వారా పార్టీ నుంచి బయటకు రప్పించేందుకు ఇంటెలిజన్స్ వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అవి ఫలించలేదు. కానీ ఆమె సోదరుడు సూర్యంతో ఫోన్ చేయించి.. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, ఘర్షణలు, తల్లి అనారోగ్యం గురించి చెప్పించి నెమ్మదిగా ఒప్పించారు.
పార్టీలోనే ఉంటూ అగ్రనేతల వివరాలు అందిస్తే కష్టాలు తీరుతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా రాధను ఒప్పించి ఇన్ఫార్మర్గా మార్చుకున్నారు” అని ఉంది. ఇటీవల ఒడిశా, తెలంగాణ, చత్తీస్‌గఢ్ బార్డర్లలో మావోయిస్టు పార్టీకి తగులుతున్న ఎదురుదెబ్బలకు ప్రధాన కారణం కోవర్టులు, ఇన్ఫార్మర్లు, పోలీసు ఏజెంట్లేనని తమ పార్టీ గుర్తించిందని గణేశ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నీల్సో అలియాస్ రాధపై విచారణ జరిపి అంతమొందించినట్లు తెలిపారు.
తొమ్మిది రోజుల్లో ముగ్గురి హత్య
చత్తీస్‌గఢ్ దండకారణ్యం, తెలంగాణ, ఏవోబీలో మావోయిస్టు పార్టీ తొమ్మిది రోజుల్లో ఇన్ఫార్మర్ల పేరిట ముగ్గురిని హత్య చేయడం కలకలం రేపుతున్నది. ఈ ఏడాది 120 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. పార్టీకి తగులుతున్న వరుస ఎదురుదెబ్బలకు కారణం కోవర్టులు, ఇన్ఫార్మర్లేనని మావోయిస్టు అగ్రనాయకత్వం భావిస్తున్నది. ఇదే క్రమంలో.. పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ ఇన్చార్జ్ కుర్సం మనీష్‌ను ఈ నెల 13న మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి, ఇన్ఫార్మర్గా పేర్కొంటూ చంపేశారు.
ఆ తర్వాత మావోయిస్టు మాస్టర్ మైండ్ హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలోనూ సోయం శంకర్ అనే పదో తరగతి విద్యార్థి సైతం హత్యకు గురయ్యారు. తాజాగా మాజీ మహిళా కమాండర్ నీల్సో అలియాస్ రాధను కూడా ఇన్ఫార్మరంటూ హత్య చేయడం కలకలం రేపుతున్నది. ఈ పరిణామాలతో కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అలెర్ట్ అయ్యాయి. లొంగిపోయిన మావోయిస్టులు, పోలీస్ హిట్ లిస్టులో ఉన్న వారిని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.