కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న వరంగల్ లో వరుసగా నేతలను హెచ్చరిస్తూ వస్తున్న మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. భూకబ్జాలు చేస్తున్నారంటూ లేఖలు రిలీజ్ అవుతున్నాయి. టీఆర్ఎస్ నేతలపై భూకబ్జాలు, దందాలు, సెటిల్ మెంట్ల ఆరోపణలతో హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత జనగామ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని హెచ్చరిస్తూ మరో లెటర్ వచ్చింది.
కొద్ది రోజుల క్రితమే ములుగు జిల్లాలో టీఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ లెటర్లు రిలీజ్ చేసింది మావోయిస్ట్ పార్టీ. అవినీతి అధికారులు, రాజకీయ నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ ఏటూరునాగారం- మహదేవ్ పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత తీవ్రంగా హెచ్చరికలు చేశారు. ఆదివాసీల భూములు ఆక్రమించారని కొందరినీ, నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్ముతున్నారని వ్యాపారులను హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ వెంకటాపూర్ వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరుతో కూడా టీఆర్ ఎస్ నాయకుల్ని హెచ్చరిస్తూ లేఖలు విడుదలయ్యాయి.
వరంగల్ సిటీలో భూ ఆక్రమణలు, సెటిల్ మెంట్లతో పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న అధికార పార్టీ నేతలు పద్ధతి మార్చుకోవాలని సీపీఐ మావోయిస్టు పార్టీ జయశంకర్ , మహబూబాబాద్ , వరంగల్ , పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో లేఖ వచ్చింది. వరంగల్ అర్బన్ జిల్లా జక్కలొద్దిలోని దళితుల భూములను టీఆర్ ఎస్ నేత కేడల జనార్ధన్ ఆక్రమించారనీ .. పెగడపల్లిలో నాదెండ్ల శ్రీధర్ , రెడ్డిపురంలో రంజిత్ రెడ్డి పేద రైతుల భూములను ఆక్రమించారని మావోయిస్టు లేఖలో ఆరోపించారు. ఖిలా వరంగల్ కు చెందిన బిల్లా శ్రీకాంత్ వంచనగిరికి చెందిన కొమ్ముల కట్టయ్య , బిల్లా రమణారెడ్డి , రవీందర్ రెడ్డి చింతగట్టు ప్రజల భూములను ఆక్రమించారని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, ధర్మారం కొమ్ముల కిశోర్ , రంగంపేటకు చెందిన జన్ను అనిల్ అలియాస్ చిట్టి, కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్క ర్ , అనంతసాగర్ ఎంపీటీసీ బండ రత్నాకర్ రెడ్డి, పెద్దాపురం కొడెపాక సుధాకర్ , మాజీ ఎంపీపీ దేవనూరి రఘు, టేకుల గూడెంకు చెందిన ప్రభుదాస్.. సెటిల్ మెంట్ లు, భూ కబ్జాలు చేస్తున్నారని హెచ్చరించారు. పోలీసుల అండదండలతో రౌడీయిజం, భూ కబ్జాలు చేస్తూ వందల ఎకరాలు ఆక్రమించి.. కోట్ల రూపాయలు కూడబెట్టారని మావోయిస్టు నేత వెంకటేశ్ పేరుతో వచ్చిన ప్రకటన విడుదల చేశారు. తాను భూ కబ్జాలు చేయలేదనీ…కబ్జా చేసిన భూములు తన దగ్గరున్నట్టు నిరూపిస్తే వాటిని ప్రజలకి పంచాలని, తనపై ఆరోపణలపై మావోయిస్టు పార్టీ పునరాలోచించుకోవాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమార స్వామి అన్నారు.
జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆయన అనుచరులు తౌటి రెడ్డి జగదీశ్ రెడ్డి, కార్పోరేటర్ లింగం చరణ్ రెడ్డి, సోంపెల్లి స్వామి, మాచర్ల కిషన్.. గ్యాంగ్ గా మారి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆ లేఖలో మావోయిస్టులు తెలిపారు. ఈ లేఖపై జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన అనుచరులతో తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు. తప్పు చేసినట్టు నిరూపిస్తే తానే శిక్ష విధించుకుంటానన్నారు.
తాజాగా పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారంటూ కొందరిని హెచ్చరిస్తూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. మానవహక్కుల నేత, కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉంటూ పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నారని పెద్దిరెడ్డిపై లెటర్ రిలీజైంది. పద్దతి మార్చుకోకపీతే ప్రజల చేతిలో పెద్దిరెడ్డికి శిక్ష తప్పదని హెచ్చరించారు మావోయిస్టులు. చర్ల మండలం కొత్తూరుకు చెందిన పెద్దిరెడ్డి… సీఐ ప్రభాకర్ కు ఇన్ఫార్మర్ గా మారాడని ఆ లేఖలో హెచ్చరించారు. సిపిఐ మావోయిస్టు పేరిట వచ్చిన లెటర్లపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇవి మావోయిస్టు పార్టీ నుంచి విడుదలయ్యాయా.. లేక ఎవరైనా ఆ పేరుతో నకిలీ లేఖలు పంపుతున్నారా… అనే దానిపైనా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు లెటర్స్ ద్వారా ఆయా వ్యక్తులపై వచ్చిన ఆరోపణలు.. పాత కేసులు, ఇతర నేర చరిత్రను ఎస్బీ, ఇంటెలిజెన్స్ విభాగాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.