
- గిరిజన యువకులను బలగాల్లోకి తీసుకొని ఎన్‌కౌంటర్లు చేయిస్తున్నరు
- ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న హత్యకాండలను నిలిపివేయాలి
- సానుకూల వాతావరణం కల్పిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని వెల్లడి
జయశంకర్‌భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణం కల్పిస్తే శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో బుధవారం మీడియాకు ఒక లేఖను రిలీజ్ చేశారు. మావోయిస్ట్ ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాలకు చెందిన గిరిజన యువతీ, యువకులను భద్రతాబలగాల్లో రిక్రూట్ చేసుకొని వారితోనే ఆదివాసీలను ఎన్‌కౌంటర్లు చేయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనార్థం శాంతి చర్చలకు మేం సిద్ధమేనని ప్రకటించారు.
ఆపరేషన్ కగార్ పేరుతో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యకాండలను, నరసంహారాన్ని (జీనోసైడ్) నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంప్‌ల ఏర్పాటును ఆపివేయాలని లేఖలో డిమాండ్ చేశారు. గత 15 నెలలుగా జరిగిన ఎన్‌కౌంటర్లలో వివిధ స్థాయికి చెందిన 400 మంది మావోయిస్టులు చనిపోయారని, వీరిలో 1/3 వంతు గిరిజనులే ఉన్నారన్నారు. తమ ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామన్నారు. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతి చర్చల కమిటీని, ప్రజాపక్ష మేధావులను, రచయితలు, జర్నలిస్టులు, హక్కుల సంఘాలు, ఆదివాసీ, దళిత సంఘాలను లెటర్‌లో కోరారు.