- మందుపాతరలు అమర్చి పోలీసులను చంపే కుట్ర
- ఆరుగురు సానుభూతిపరులు అరెస్ట్
వెంకటాపురం, వెలుగు : రాబోయే ఎన్నికల సందర్భంగా అడవిలోకి కూంబింగ్‌కు వచ్చే పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చడానికి వస్తున్న ఆరుగురు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. చత్తీస్గఢ్దండకారణ్యం నుంచి కొందరు మావోయిస్టు సానుభూతిపరులు గురువారం సరిహద్దుల్లోని సూరవేడు (కొత్తపల్లి క్రాస్) వద్ద మందుపాతరలు అమర్చడానికి వస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిపై నిఘా పెట్టి పట్టుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారిలో చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఉసురు బ్లాక్, పూజారి కాంకేట్, ఊట్లపల్లి గ్రామాలకు చెందిన తాటి అర్జున్, సోడి వీరయ్య , సోడి గోపి, సోడి రామయ్య , తాటి రమేశ్, సోడి నాగేశ్ ఉన్నారని వెంకటాపురం సీఐ బండారి కుమార్ తెలిపారు. వీరి నుంచి12 జిలెటిన్ స్టిక్స్-, 2 డిటోనేటర్లు, 4 బ్యాటరీలు-, 60 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్-, 2 టిఫిన్ బాక్సులు, ఎన్నికలను బహిష్కరించాలంటూ ముద్రించిన పాంప్లెట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరంతా గతంలో మావోయిస్టు సానుభూతిపరులుగా ఉండి జైలు జీవితం గడిపివచ్చారన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు కొప్పుల తిరుపతి, రేఖ, అశోక్ పాల్గొన్నారు.