తెలంగాణ-చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో.. మావోల కలకలం

తెలంగాణ-చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో.. మావోల కలకలం
  • చత్తీస్‌‌గఢ్‌‌లో వరుస ఎన్‌‌కౌంటర్లతో తెలంగాణ వైపు కదలికలు
  • ములుగు జిల్లాలోని కర్రెగుట్టల వైపు రావద్దని గిరిజనులకు హెచ్చరికలు
  • రావొద్దనే అధికారం మీకు ఎక్కడిది అంటున్న గిరిజన సంఘాల లీడర్లు


జయశంకర్‌‌ ‌‌భూపాలపల్లి, వెలుగు : చత్తీస్‌‌గఢ్‌‌, తెలంగాణ బార్డర్‌‌లో మావోయిస్టుల  కదలికలు కలకలం రేపుతున్నాయి. చత్తీస్‌‌గఢ్‌‌ ఎన్‌‌కౌంటర్ల నేపథ్యంలో కొందరు మావోయిస్టులు తెలంగాణకు మకాం మారుస్తున్నారనే వార్తలు మొదలయ్యాయి. తెలంగాణ-– చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో ఉన్న కర్రె గుట్టల వైపు గిరిజనులు రావొద్దని మావోయిస్టులు ఇటీవలే హెచ్చరికలు జారీ చేశారు. గుట్టలపై బాంబులు అమర్చినట్లుగా లేఖలు విడుదల చేయడంతో పోలీస్‌‌ శాఖ స్పెషల్‌‌ ఫోకస్‌‌ చేసింది. 

మరోవైపు మావోయిస్టులు విడుదల చేసిన లేఖలను ఇటు పోలీసులు, అటు గిరిజన సంఘాల నేతలు సైతం ఖండిస్తున్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజనులను అడవిలోకి రావద్దనడానికి మావోయిస్టులకు హక్కు ఎక్కడిది ? అంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.

కలకలం రేపిన మావోయిస్టుల లేఖ

‘ఆపరేషన్ కగార్‌‌ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాడుల నుంచి రక్షించుకునేందుకు కర్రె గుట్టలపై బాంబులు ఏర్పాటు చేశాం’ అంటూ మావోయిస్టులు  ఇటీవల విడుదల చేసిన లేఖ ములుగు జిల్లాలో కలకలం రేపింది. వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం ఎవరూ గుట్టలపైకి రావొద్దంటూ మావోయిస్టు పార్టీ వెంకటాపురం – వాజేడు మండల కార్యదర్శి శాంత పేరిట లెటర్‌‌ రిలీజ్‌‌ అయింది. 

కొందరు ఆదివాసీలను ఇన్‌‌ఫార్మర్లుగా మార్చుకున్న పోలీసులు.. వేట పేరుతో గుట్టలపైకి పంపుతుండడంతో బాంబులు పేలి గిరిజనులు చనిపోవడం, గాయపడడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ‘ఇన్‌‌ఫార్మర్లుగా మారవద్దు... కుటుంబాలను కష్టాల పాలు చేయొద్దు. పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తారు... వారి వలలో పడి కర్రె గుట్టపైకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

కర్రె గుట్టలపై పోలీసుల ఫోకస్‌‌‌‌

కర్రె గుట్టలపై బాంబులు పెట్టామంటూ లేఖ విడుదల కావడంతో ములుగు పోలీసులు అలర్ట్‌‌ అయ్యారు. కూంబింగ్‌‌ కోసం వెళ్లే పోలీసులను చంపడానికే ఈ బాంబులు అమర్చినట్లు పోలీస్‌‌ శాఖ భావిస్తోంది. చత్తీస్‌‌గఢ్‌‌లో  ఇటీవల జరుగుతున్న వరుస ఎన్‌‌కౌంటర్లతో వందలాది మంది మావోయిస్టులు చనిపోతున్నారు. దీంతో సేఫ్‌‌ జోన్‌‌ వెతుక్కునే పనిలోనే మావోయిస్టులు రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 

ప్రస్తుతం ఆకురాలి అడవులు పలచబడడంతో మావోయిస్ట్‌‌ స్థావరాలు భద్రతా బలగాలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం వైపు మావోయిస్టులకు సేఫ్‌‌జోన్‌‌గా ఉన్న అడవులు, గుట్టల్లోకి పోలీసులు రాకుండా అడ్డుకునేందుకే ప్రెషర్‌‌ బాంబ్స్‌‌, మందుపాతరలు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆదివాసీలు భయపడొద్దు 

మావోయిస్టులు రిలీజ్‌‌‌‌ చేసిన లేఖను చూసి ఆదివాసీలు భయపడొద్దు. ములుగు, బీజాపూర్‌‌ జిల్లా సరిహద్దుల్లోని వివిధ గ్రామాల గిరిజన, గిరిజనేతర ప్రజలు పూర్తిగా అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తారు. కర్రె గుట్టపై ప్రజలు నిత్యం తిరిగే ప్రదేశాల్లో మావోయిస్టులు ప్రెషర్‌‌ మైన్స్‌‌ అమర్చి వారి జీవించే హక్కును కాలరాస్తున్నారు. దీనిని పోలీస్‌‌‌‌ శాఖ ఖండిస్తున్నది. కర్రె గుట్టలపై మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌‌ మైన్స్‌‌ను పోలీస్‌‌ శాఖ ఎప్పటికప్పుడు తొలగిస్తోంది.
- శబరీశ్‌‌, ములుగు ఎస్పీ

ఖండిస్తున్న పోలీసులు, ఆదివాసీ సంఘాలు

కర్రె గుట్టలపైకి రావొద్దని మావోయిస్టులు విడుదల చేసిన లేఖను అటు పోలీసులు, ఇటు ఆదివాసీ యువజన సంఘం నాయకులు ఖండించారు. ‘అడవుల్లో మందుపాతరలు ..  ఆదివాసులను అడ్డుకుంటున్న మావోయిస్టులు’ అనే శీర్షికతో ఆదివాసీ సంఘం నాయకులు ఓ లెటర్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేశారు. ‘ప్రతి రోజు ఆదివాసీ ప్రజలపై ఆధారపడి బ్రతికే మీరు, అడవులే ఆధారంగా జీవనోపాధి పొందుతున్న వారిని.. అడవుల్లోకి రావొద్దని చెప్పే అధికారం మీకెవరిచ్చారు ? భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను నియంత్రించే అధికారం మీకెక్కడిది ? అడవుల్లో విచ్చలవిడిగా మందుపాతరలు పెడితే ఆదివాసీలు బ్రతికేదెలా ? మీరు అమర్చిన మందుపాతరల వల్ల ఇప్పటికే చాలామంది అమాయక ఆదివాసీలు చనిపోయారు’ అని లేఖలో పేర్కొన్నారు. పోలీసు ఇన్‌‌ఫార్మర్లు అంటూ గిరిజనులపై నిందలు మోపడం సరికాదన్నారు.