కర్రి గుట్ట వద్దకు ఎవ్వరూ రావద్దు..లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

కర్రి గుట్ట వద్దకు ఎవ్వరూ రావద్దు..లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
  • వెంకటాపురం మండలం కర్రి గుట్ట చుట్టూ బాంబులు అమర్చాం

వెంకటాపురం, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్  కగార్  పేరుతో చేస్తున్న దాడుల నుంచి కాపాడుకోవడానికి కర్రెగుట్ట చుట్టూ బాంబులు పెట్టామని మావోయిస్టులు సోమవారం లేఖ విడుదల చేశారు. ప్రజలు వేట, అటవీ ఉత్పత్తుల కోసం గుట్టపైకి రావద్దని వెంకటాపురం, వాజేడు మండల కార్యదర్శి శాంత లేఖద్వారా విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారి, బహుళ జాతి కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఆపరేషన్  కగార్  చేపట్టి మావోయిస్టులపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు.

పోలీసు బలగాల నుంచి రక్షణ పొందేందుకు బాంబులు అమర్చామని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రజలకు తెలియజేశామని, కొంత మంది ఆదివాసీలను ఇన్​ఫార్మర్లుగా మార్చుకొని పోలీసులు వేట పేరుతో గుట్టపైకి పంపుతున్నారని పేర్కొన్నారు. ఆత్మ రక్షణ కోసం ఏర్పాటు చేసిన బాంబులు పేలి గిరిజనులు చనిపోవడం, గాయపడడం జరిగిందని, ఇన్​ఫార్మర్లుగా మారి కుటుంబాలను ఆగం చేయవద్దని కోరారు.

పోలీసుల మాయమాటలు నమ్మి గుట్టపైకి రావద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో దళారులకు, పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చేలా పాలన జరుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్  ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని, ప్రజల దరఖాస్తులు పరిష్కారం కావడం లేదన్నారు. రైతులు, ప్రభుత్వ, ఫారెస్ట్  భూములను దళారులకు, పెట్టుబడిదారులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.