దారుణం.. ఇన్‌‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని చంపిన మావోయిస్టులు

దారుణం.. ఇన్‌‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని చంపిన మావోయిస్టులు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో మావోయిస్టులు గురువారం ఇన్​ఫార్మార్లు అనే నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. కిడ్నాప్ చేసిన మరో స్టూడెంట్​ను మాత్రం వదిలేశారు. బీజాపూర్ జిల్లా బైరంగఢ్ పోలీస్​స్టేషన్ పరిధిలోని జప్పేమరక గ్రామం నుంచి రెండు రోజుల క్రితం మాడివి సూజ, పొడియం కోసాలతో పాటు మిర్తూరు హాస్టల్​లో చదువుతున్న డిపొయం హిడ్మాలను కిడ్నాప్ చేశారు. జప్పేమరక అడవుల్లో గురువారం ప్రజాకోర్టు నిర్వహించి చుట్టు పక్కల గ్రామాల వారిని తరలించారు. అక్కడ వీరి ముగ్గురిపై పలు ఆరోపణలు చేశారు. 

మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు నిరంతరం చేరవేస్తున్నారని తెలిపారు. ఎన్నిసార్లు మందలించినా వీరి తీరులో మార్పు రావడం లేదని అందుకే మరణదండన విధిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామస్తులు వేడుకున్నా వినలేదు. మాడివి సూజ, పొడియం కోసాలను చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. వారి చొక్కాలకు బైరంగఢ్ ఏరియా కమిటీ పేరుతో లేఖలు తగిలించారు. ఇన్​ఫార్మర్లను వదిలిపెట్టేది లేదని, బీజేపీ సర్కార్ నిర్వహిస్తున్న ఆపరేషన్ ప్రహార్ వెంటనే నిలిపివేయాలని, బూటకపు ఎన్​కౌంటర్లు ఆపాలని డిమాండ్​ చేశారు. స్టూడెంట్ పొడియం హిడ్మాను గ్రామస్తులకు 
అప్పగించారు.