
ములుగు జిల్లాలో కూలీల అక్రమ అరెస్ట్ లు ఆపివేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్ట్ లు లేఖ విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జయశంకర్- మహబూబాబాద్- వరంగల్ (2)- పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ రాగా... ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణకు మిరప చేలల్లో పని చేసేందుకు కూలీ పనులకు వస్తున్న వారిని ఛత్తీస్ గఢ్-, -తెలంగాణ పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, చిత్రహింసలు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల వైఖరిని ప్రజాస్వామిక వాదులు, మేధావులు, పౌరహక్కుల సంఘాలు అందరూ కలిసి ఖండించాలని మావోలు పిలుపునిచ్చారు.
ఛతీస్ గఢ్ ఆదివాసీ ప్రజలు ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, కన్నాయి గూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాలకు వస్తున్న కూలీలను పోలీసులు అరెస్టులు చేయటం దుర్మార్గమని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్ గడ్- తెలంగాణ పోలీసులు కూలీలు మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారని భయబ్రాంతులకు గురి చేస్తూ.. వేధింపులకు గురి చేయటం మానుకోవాలని కోరారు. పోలీసులు కొంతమందికి డబ్బులు ఆశలు చూపి పోలీసు ఇన్ఫార్మర్స్ గా మారాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ద్రోహులుగా మారని వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని మావోలు లేఖలో పేర్కొన్నారు.