సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరులో శిథిల దేవాలయ స్థలంలో శాసనంతో కూడిన మారకమ్మ విగ్రహాన్ని గుర్తించినట్లు సోమవారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం యువ పరిశోధకుడు, సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని శిథిలమైన భూలక్ష్మిదేవి గుడి స్థలంలో కొత్తగా గుడికట్టడానికి తవ్వుతుండగా మట్టిలో కూరుకునిపోయిన విగ్రహం బయటపడిందన్నారు. దాన్ని పరిశీలించి విగ్రహ పీఠం మీద శాసనాన్ని గుర్తించినట్లు తెలిపారు.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మారకమ్మ విగ్రహ పీఠంపై ఉన్న శాసనాన్ని చదివి, దాని చారిత్రక సమయాన్ని వివరించారన్నారు. ఈ విగ్రహం పాదపీఠిక మీద 13వ శతాబ్దపు తెలుగు లిపిలో, తెలుగు భాషలో 3 పంక్తుల శాసనం గుర్తించామని తెలిపారు. ఈ శాసనం ఆ దేవతాశిల్పం(విగ్రహం) ప్రతిష్ఠాపనకు సంబంధించిందని గుర్తించినట్లు చెప్పారు. శిల్పం కింద పీఠం మీద ఉన్న శాసనంలో1,225 జూన్ 14న మారకమ్మ విగ్రహం ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నదన్నారు. చాముండి రూపంలో ఉన్న మారకమ్మనే కానీ భూలక్ష్మి కాదన్నారు.