కర్రలు, రాళ్లతో కొట్టారు.. తెలంగాణ ఉద్యమంలోనూ ఇలా జరగలే: మారం జగదీశ్వర్

కర్రలు, రాళ్లతో కొట్టారు.. తెలంగాణ ఉద్యమంలోనూ ఇలా జరగలే: మారం జగదీశ్వర్

హైదరాబాద్: రాజకీయాలు చేసుకోండి.. కానీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయకండని రాజకీయ నాయకులకు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి ఘటనపై సోమవారం (నవంబర్ 13) ఆయన స్పందించారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన అధికారులపై దాడి చేయడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బండలు.. కర్రలతో దాడి చేశారని.. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు.

కులగణన చేసే సమయంలో కూడా అధికారులు, సిబ్బందిపై మాటలతో దాడి చేస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదన్నారు. లగచర్లలో కలెక్టర్‎పై దాడి జరిగితే ఐఏఎస్ సంఘాలు ఖండించలేదని.. ఉద్యోగ సంఘాల నేతలుగా మేం ఆ దాడిని ఖండిస్తున్నామన్నారు. కలెక్టర్, అధికారులపై దాడిచేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భౌతిక దాడులతో విధి నిర్వహణ సమయంలో మా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

లగచర్ల దాడి తర్వాత తెలంగాణాలో ఉద్యోగులు భయంతో పని చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు భూసేకరణ జరగకుండా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని ఆయన ప్రశ్నించారు.  లగచర్లలో మొన్నటి దాడి చూస్తే సిగ్గుగా ఉందని.. ఈ ఘటనతో తర్వాత ఒంటరిగా మహిళా వెళ్లి ఉద్యోగం చేస్తదా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు జనాలను రెచ్చగొట్టకుండా.. చైతన్యపర్చాలని సూచించారు. లగచర్ల దాడికి నిరసనగా 2024, నవంబర్ 14వ తేదీన లంచ్ అవర్లో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.