ముంబైలో హిందీ Vs మరాఠీ భాష వివాదం: ఆర్ఎస్ఎస్ నేతపై సీఎం రియాక్షన్ ఇదే..!

ముంబైలో హిందీ Vs మరాఠీ భాష వివాదం: ఆర్ఎస్ఎస్ నేతపై సీఎం రియాక్షన్ ఇదే..!

హిందీ భాష చిచ్చు తమిళనాడులో చల్లారకముందే.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రానికి అంటుకుంది. ముంబై వాళ్లకు మరాఠీ భాష అవసరం లేదు..మాట్లాడాల్సిన అవసరం అస్సలు లేదంటూ ఆర్ఎస్ఎస్ లీడర్ చేసిన వ్యాఖ్యలు..మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ అంశం మహారాష్ట్ర అసెంబ్లీని తాకింది. దీంతో బీజేపీ సీఎం ఫడ్నవీస్ ఈ అంశంపై సభలోనే స్పందించారు.

మరాఠీభాషపై ఆర్ఎస్ఎస్ లీడర్  బయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో కొత్త వివాదానికి తెరతీశాయి. ముంబైలో ఉండేవాళ్లకు మరాఠీ అవసరం లేదు..మాట్లాడాల్సిన అవసరం అస్సలు  లేదు  అని బయ్యాజీ జోషి స్టేట్మెంట్ ఇవ్వడం మహారాష్ట్రలో పెద్ద దుమారం రేపింది. అధికార బీజేపీకి సమాధానం చెప్పు కోలేని పరిస్థితి ఏర్పడింది.. మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బయ్యాజీ జోషి వ్యాఖ్యలను సమర్ధించడం అధికార బీజేపీ పార్టీకి కూడా కష్టమైంది. సీఎం ఫడ్నవీస్ సమాధానం చెప్పుకోలేక తికమక పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

‘‘మరాఠి ముంబై, మహారాష్ట్ర, రాష్ట్రప్రభుత్వ భాష.. మరాఠీభాష రాష్ట్ర సంస్కృతి, గుర్తింపులోఓ భాగం..ప్రతి పౌరుడు మరాఠీని విధిగా నేర్చుకోవాలి’’ అని సీఎం ఫడ్న వీస్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మరాఠీ భాష గౌరవించబడుతుంది.. రక్షించబడుతుంది.. మరాఠీ భాష సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం అన్నారు.

ALSO READ | చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై అరెస్ట్ 

ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో జరిగిన సమావేశంలో జోషి మాట్లాడుతూ..‘‘ముంబయికి ఒకే భాష లేదు..ముంబైలోని ఒక్కో ప్రాంతంలోఒక్కో భాష మాట్లాడతారు.. ఘట్‌కోపర్ ప్రాంతంలోని భాష గుజరాతీ. కాబట్టి ముంబైలో నివసించేవాళ్లు మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసక్తిక రమైన విషయం ఏంటంటే.. జోషి ఈ వ్యాఖ్యలుచేసిన సమయంలో బీజేపీనేత, మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా కూడా వేదికపై ఉండటం. 

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠీ భాషపై కీలక నిర్ణయం తీసుకుంది. ICSE, CBSE బోర్డుల్లో ప్రైమరీ, ఇంటర్మీడియట్ స్కూళ్లలో మరాఠీని తప్పనిసరి చేసింది. 

ఆర్ఎస్ఎస్ నేత బయ్యాజీ జోషి వ్యాఖ్యలను కాంగ్రెస్, శివసేన(యూబీటీ) నేతలు తీవ్రంగా విమర్శించారు. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. కోల్ కతా వెళ్లి బెంగాళీ మాట్లొద్దు, చెన్నై వెళ్లి తమిళ మాట్లాడొద్దని చెప్పగలరా అని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగ సమస్యలనుంచి డైవర్ట్ చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, చర్చలు పెడుతున్నారని కాంగ్రెస్  నేత నానా పటోల్ విమర్శించారు.