మహారాష్ట్రలో మరాఠీ భాషపై లొల్లి

మహారాష్ట్రలో మరాఠీ భాషపై లొల్లి

ముంబై: హిందీ భాష చిచ్చు తమిళనాడులో చల్లారకముందే.. బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రకూ అంటుకుంది. ఆర్ఎస్ఎస్ లీడర్ బయ్యాజీ జోషి మరాఠీ భాషపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో కొత్త వివాదానికి తెరతీశాయి. ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలో జోషి మాట్లాడుతూ.. ‘‘ముంబైకి ఒకటే భాష లేదు. సిటీలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడతారు. 

ఘట్ కోపర్ ప్రాంతంలోని భాష గుజరాతీ. కాబట్టి, ముంబైలో నివసించేవాళ్లు మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడాల్సిన అవసరం అస్సలు లేదు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జోషి స్టేట్మెంట్ మహారాష్ట్రలో పెను దుమారం రేపింది. అధికార బీజేపీకి సమాధానం చెప్పు కోలేని పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 

బయ్యాజీ జోషి వ్యాఖ్యలను సమర్ధించడం అధికార బీజేపీ పార్టీకి కూడా కష్టమైంది. దీంతో సీఎం ఫడ్నవీస్ సమాధానం చెప్పుకోలేక తికమక పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.