
పారిస్: విమెన్స్ మారథాన్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన సిఫాన్ హసన్ 2 గంటల 22 నిమిషాల 55 సెకండ్లతో ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేస్తూ విజేతగా నిలిచింది. 5 వేల, 10 వేల మీటర్ల ఈవెంట్లలో కాంస్య పతకాలు గెలిచిన హసన్.. మారథాన్ సహా 62 కిలోమీటర్లు పరుగెత్తడం విశేషం. ఇథియోపియా అథ్లెట్ టిస్ట్ అసెఫా (2:22:58 సె) రజతం గెలవగా, కెన్యాకు చెందిన హెలెన్ ఒబిరి కాంస్య పతకం గెలిచింది. చివరి 150 మీటర్ల వరకు అసెఫాతో సమానంగా నిలిచిన హసన్ చివర్లో వేగం పెంచి స్వర్ణం సొంతం చేసుకుంది.
చివరి రన్నర్ కోసం.. అభిమానుల కేరింతలు
ఈ ఈవెంట్‌లో భూటాన్‌కు చెందిన కింజాంగ్ లమో మారథాన్‌లో చివరి, 80వ స్థానంలో నిలిచింది. మిగతా రన్నర్లంతా తనకంటే చాలా ముందుగానే ఎండ్‌లైన్ దాటేయగా.. లమో ఒక్కతే మిగిలిపోయింది. ఒంట్లో శక్తి కూడా తగ్గిపోవడంతో పోటీ పూర్తి చేసేందుకు చాలా కష్టపడుతూ ఒక్కో అడుగు వేస్తోంది. ఈ విషయం గమనించిన అభిమానులు.. బ్యారికేడ్ల పక్కన నిల్చొని ఆమెను ఉత్సాహ పరిచారు. కొంత మంది అయితే.. కొద్ది దూరం నుంచి ఆమెను అనుసరిస్తూ పరుగెత్తారు. షినిష్ లైన్ దాటిన వెంటనే గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించారు.