గడ్డికూడా కరువే

మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం ఎడారిలా మారింది. వానలు పడకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. పశువులకు కాస్తంత గడ్డి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పచ్చని పచ్చిక బయళ్లు మాయం అయ్యాయి. మూగజీవాలకు గడ్డి వేయడం రైతులకు తలకు మించిన భారంలా మారింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు తట్టాబుట్ట సర్దుకుని వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు.

 

ఎటు చూసినా చుక్క నీరు కనపడదు. గుక్కెడెనీటి కోసం జనం నానా కష్టాలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం మైళ్లు మైళ్లు నడవాల్సిన దయనీయ పరిస్థితులు. కిందటేడాది నవంబర్ నుంచే మరఠ్వాడాలో నీటి కటకట ఏర్పడింది. దీనికి తోడు సీజన్ ప్రకారం పడాల్సిన వానలు పడకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. నోరులేని మూగజీవాల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మేకలు, ఆవులకు మేత కరువైంది. పరిస్థితులు ఇంతదారుణంగా ఉన్నా ప్రభుత్వ యంత్రాంగం నామ్ కే వాస్తే అన్నట్లు స్పందించింది. అక్కడక్కడా కొన్నిగ్రామాల్లో పశువులకు గడ్డి సరఫరా చేసే కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. అది కూడా ఆవులు, గేదెలకే. చిన్న జీవాలైన మేకలు, గొర్రెల గడ్డివిషయాన్ని సర్కార్ లైట్ గా తీసుకుంది.

పశువులే రైతులకు జీవనాధారం
మరఠ్వాడా రైతులకు వ్యవసాయం కలిసి రాలేదు.అప్పో సప్పో చేసి పంటలు వేసినా పెట్టుబడి కూడా రాని పరిస్థితులను ఇక్కడి రైతులు ఎదుర్కొన్నారు. దీంతో బతకడానికి పశువులను నమ్ముకున్నారు. పాడిఆవులను, గేదెలను పెంచుకుంటున్నారు. ఈ పాలను అమ్ముకోవడం ద్వారా వచ్చే సొమ్ము తోనే బతుకుబండి నడుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా పశువులకు గడ్డి కూడా దొరక్కపోవడంతో ఇక్కడిరైతుల పరిస్థితి అగమ్యగోచరంలా తయారైంది. ఈఏడాది మరఠ్వాడా ప్రాంతంలో వానలు పడలేదు. దీంతో రబీ సీజన్ లో రైతులు పంటలు కూడా వేసుకోలేదు. వానలు పడకపోవడంతో ఈ ప్రాంతంలో పచ్చదనం అనేదే కనిపించకుండా పోయింది. గ్రౌండ్ వాటర్ నిల్వలు కూడా అడుగంటాయి. ఈపరిస్థితుల్లో సర్కార్ పంపే వాటర్ ట్యాంకర్లే ఊరిజనానికి ఆధారమయ్యాయి. ట్యాంకర్ కూడా డైలీరాదు. నాలుగైదు రోజులకు ఓసారి వస్తుంది. దీంతోనే ప్రజలు తాగు నీటి అవసరాలు తీర్చుకోవాలి. ఇప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పశువులుతాగడానికి కూడా ఈ నీటిపైనే ఆధారపడాల్సిన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.

తరలిపోతున్న మరఠ్వాడా రైతులు
పశువులకు కాస్తంత గడ్డి కూడా పెట్టలేని పరిస్థితు లురావడంతో ఇక్కడి రైతులకు దిక్కుతోచడం లేదు.గతిలేని పరిస్థితుల్లో ఇంటిల్లిపాది వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. కొంతమంది పశువులను తక్కువరేటుకు అమ్ముకుంటున్నారు. ఒక్కో గేదెను రూ.70వేల నుంచి లక్ష వరకు రేటు పెట్టి కొన్న రైతులు ఇప్పుడు రూ.30 వేలకే అమ్ముకుంటున్నారు. ఇంతనష్టానికి అమ్ము కోవాలని చూస్తున్నా కొనే వాళ్లే కరువయ్యారని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరకొరగా గడ్డి కేంద్రాలు
మరఠ్వాడా ప్రాంతంలో కరువు నెలకొనడంతో గడ్డికేంద్రాలు ఏర్పాటు చేయాలని కొన్ని నెలల కిందటే రైతులు ఉద్యమించారు. సర్కార్ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. రైతుల ఉద్యమానికి సర్కార్ స్పందించింది. అయితే పెట్టాం అంటే పెట్టాం అన్నట్లు ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లోనే ఈ గడ్డికేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో చుట్టుపక్కలగ్రామాల రైతులు పశువుల మేత కోసం పనిగట్టుకునికొన్ని కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ గడ్డి కేంద్రాలకువెళ్లాల్సి వస్తోంది. ఆకాశాన్ని అంటిన గడ్డి మోపు ధరలు పశువులకు గడ్డి దొరక్కపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది వ్యాపారస్తులు బయల్దేరారు. కమర్షియల్ గా గడ్డి మోపు సెంటర్లు ఏర్పాటు చేశారు. గడ్డితోబిజినెస్ చేస్తున్నారు. ఒక్కో గడ్డి మోపును రూ. 40 కు అమ్ముతున్నారు. ఇంత రేటు పెట్టి గడ్డి మోపును కొనలేమంటున్నారు సన్నకారు రైతులు. మరఠ్వాడాకు కరువు కొత్త కాదు. అయితే 1972తర్వాత ఈ స్థాయిలో కరువు రావడం ఇదే తొలిసారి. మరఠ్వాడా లోని మెజారిటీ జిల్లాల్లో కరువు నెలకొంది. మరఠ్వాడా ప్రాంతంలోని అన్ని డ్యాములు కలిపితే సరాసరి 19 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. ఔరంగాబాద్, లాతూర్, జాల్నా, బీడ్, ఉస్మానాబాద్,నాందేడ్, పర్భణి, హింగోలి,చంద్రాపూర్, యావత్మాల్ ఇలా 11 జిల్లాల్లో 50 శాతానికి కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో వేరే ప్రాంతాలకు ప్రజలువలస వెళుతున్నారు.

మరఠ్వాడా అంటే…
స్వాతంత్ర్యం రాక ముందు మరఠ్వాడా ప్రాంతం హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత మహారాష్ట్రలో కలిసింది. . మరఠ్వాడా ప్రాంతంలో ఔరంగాబాద్, లాతూర్, నాందేడ్ నగరాలున్నాయి. ఔరంగాబాద్, బీడ్, హింగోలి, జల్నా,నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్, పర్భనిఏరియాలు మరఠ్వాడా ప్రాంతం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతం మొదటి నుంచి కరువుకు కేరాఫ్ అడ్రస్ గానే ఉంది.