March 22 Water World Day: సమస్త జీవకోటికి నీరు ఆధారం

March 22 Water World Day:  సమస్త జీవకోటికి నీరు ఆధారం

ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టడం, నీటి వృథాను అరికట్టడం,  సమర్థవంతమైన నీటి పంపిణీ  ద్వారానే సకల జీవకోటి మనుగడ సాధ్యమవుతుంది. జలం ఉన్నచోటే  మానవుని  నాగరికత  ప్రారంభమైనది.  ఒకప్పుడు పుష్కలంగా  దొరికే  నీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాం.  అవసరానికి మించి వాడుతూ వృథా చేస్తున్నాం.  

మరోవైపు అకాల వర్షాలు, వరదలు, వాతావరణ మార్పులు,  వర్షపాతంలో మార్పులు, పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, తరుగుతున్న వ్యవసాయ భూమి, జనాభా వృద్ధిరేటుకు అనువుగా లేని వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల, ఆర్థిక మందగమనం మొదలైనవి భవిష్యత్తు నీటి అవసరాలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.  హిమాని నదులు జీవకోటికి జీవనాధారం. 

హిమాని నదులు కరగడం ద్వారా మనకు కావలసిన తాగునీరు,  సాగునీరు,  పారిశ్రామిక రంగాల నీటి అవసరానికి,  విద్యుత్ ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన  పర్యావరణ  వ్యవస్థలను పెంపొందించడానికి వెలకట్టలేని  నీటిని మనకు అందిస్తున్నాయి.  వాతావరణ మార్పులు,  మానవ చర్యల వల్ల వేగంగా కరుగుతున్న హిమాని  నదుల వలన భవిష్యత్తులో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం లేకపోలేదు.  

తద్వారా ఈ భూమండలంపైన నివసిస్తున్న జీవకోటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.  దాదాపు 200 కోట్ల మంది ప్రజలు  మంచు పర్వతాలు కరగడం ద్వారా లభ్యమయ్యే హిమాని నదులపై ఆధారపడి ఉన్నారు.   తాగునీరు, సాగునీరు, విద్యుత్ శక్తి కోసం హిమాని నదులపైన ఆధారపడుతున్నారు. 

జలమే జీవాధారం కాబట్టి సమస్త జీవకోటికి తగినంత నీరు అందేలా చేయడంతో పాటు ప్రపంచ ఆహార భద్రతకు ప్రపంచ దేశాలు కృషి చేయాలి. ‘హిమాని నదుల సంరక్షణ’  ఉద్దేశంతో  ప్రపంచ నీళ్ల దినోత్సవం- 2025 మనం జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి  తెలిపింది.   

ప్రపంచ నీటి దినోత్సవం, 1993 నుంచి  ప్రతి సంవత్సరం  మార్చి 22న  ఘనంగా  వివిధ రకాల ఉద్దేశాలతో నిర్వహించుకుంటున్నాం.  దేశాల మధ్య ఉన్న నీటి పంపకం గొడవలు, జల యుద్ధాలను తగ్గించాలి.   ప్రపంచ శాంతి నీళ్లను ఒడిసి పట్టడం ద్వారానే జరుగుతుంది అనే నినాదంతో ఐక్య రాజ్య సమితి ప్రజలను చైతన్యపరచాలని సభ్య దేశాలను కోరుకుంటోంది.

నీరు ప్రకృతి ఆస్తి

నీరు ఒక సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఆస్తి.  భూమి మీద నివసిస్తున్న సమస్త  ప్రాణుల శరీరంలో 50 శాతానికి పైగా నీరు ఉంటుంది.  మానవ శరీరంలో సుమారు 70శాతం వరకు నీరు ఉంటుంది.  సమస్త  జీవ కోటికి తాగునీటితోపాటు  మన రోజువారీ కార్యక్రమాలకు,  వ్యవసాయం,  పరిశ్రమలు, వంట చేయడానికి, ఇతర కార్యక్రమాలకు నీరు చాలా అవసరం.  ఈ  భూ మండలాన్ని సుమారు 71శాతం నీటితో  ఆక్రమితమైనప్పటికీ పనికొచ్చే మంచినీరు  కేవలం 2.5% మాత్రమే.  ఈ 2.5%  మంచినీటిలో  దాదాపు 75.2 శాతం ధ్రువ ప్రాంతాలలో మంచుగా స్తంభింపజేసి ఉంది.  మరో 22.6 శాతం భూగర్భ జలాలుగా ఉన్నాయి.  ప్రపంచంలో దొరుకుతున్న మంచినీటితో సుమారు 72% మనం వ్యవసాయానికి వాడుతున్నాం. 

 ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ఆర్థిక అభివృద్ధి పేరుతో చేపడుతున్న పారిశ్రామికీకరణ, తరుగుతున్న అడవులు,  కాలుష్యం, మితిమీరిన నీటి వినియోగం,  వాతావరణ మార్పులు,  అతివృష్టి లేదా అనావృష్టి  వలన  గత  దశాబ్ద కాలంలో  ప్రతి వ్యక్తికి సరాసరి సగటున 20% మంచినీటి  వనరులు తగ్గినాయి.  

ఇది చాలా ఆందోళన కలిగించే అంశం.  ఎంతో అత్యంత విలువైన  నీటి వనరును తిరిగి పొందలేని స్థితికి మనం తీసుకెళ్తున్నాం.  నేడు సుమారు ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మంది ప్రజలు నీటి లభ్యత తక్కువగా ఉండి తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు.   నీటివనరుల కోసం పోటీ పెరుగుతోంది. 

మత్స్యసంపద ద్వారా జీవనోపాధి

సుమారు 600 మిలియన్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా జలహార వ్యవస్థలైన చేపలు, రొయ్యలు ఇతర  మత్స్యసంపద  ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.  నీటి కాలుష్యం, నిలకడ లేని పద్ధతులు, వాతావరణ మార్పుల వలన తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి.  

తెలంగాణ రాష్ట్రంలో  వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించినట్లయితే 2023-–-24 సంవత్సరంలో సుమారు 25.67 మిలియన్ మెట్రిక్ టన్నుల వడ్లు, (67% బియ్యం రికవరీతో సుమారు 17.12 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం), 2.67 మిలియన్ మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 0.2 మిలియన్ మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు, 0.34 మిలియన్ మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, 0.75 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజలు (మొత్తం వంట నూనెల ఉత్పత్తి సరాసరి సుమారు 0.20 మిలియన్ మెట్రిక్ టన్నులు), 2.43 మిలియన్ మెట్రిక్ టన్నుల పండ్లు, 1.46 మిలియన్ మెట్రిక్ టన్నుల కూరగాయలు, 0.18 మిలియన్ మెట్రిక్ టన్నుల పసుపు, 1.17 మిలియన్ మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి, 0.6 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎండు మిరపకాయలు, 6.12 మిలియన్ మెట్రిక్ టన్నుల పాలు,  పాల ఉత్పత్తులు, ఉత్పత్తి జరుగుతున్నది.  పంట మార్పిడి ద్వారా తక్కువ నీటితో వివిధ రకాల ఆహార పంటలను సాగు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి

నీటివనరులు సమృద్ధిగా లేకపోవడంతో దేశీయ నూనె గింజల ఉత్పత్తి తగ్గి  మార్కెట్లో వంటనూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దిద్దుబాటు చర్యలుగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  రైతులను  నూనె గింజలు,  ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతున్నది.  

మన రాష్ట్రంలో కూడా రైతులు పంట మార్పిడి చేపట్టి  వేరుశనగ, సోయాబీన్,  నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల సాగు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా  తక్షణ కర్తవ్యంగా నీటి వినియోగ యాజమాన్య పద్ధతులతో పాటు భవిష్యత్తులో  నీటి కష్టాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి.  

భూమి మీద నివసిస్తున్న సమస్త మానవ కోటికి  సమతుల్య ఆహారం,  పోషకాహార భద్రత, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి.  దీనికోసం  పంటల సరళిని మార్చి పోషకాహార భద్రత వైపు అడుగులేయాలి.  మన పెద్దలు సాగుచేసి తిన్నటువంటి జొన్నలు తదితర మిల్లెట్స్ పంటల సాగు విస్తీర్ణం పెంచడం తప్పనిసరి పరిస్థితి.  

మరో ముఖ్యమైన ఆహార పంటలైన పప్పు ధాన్యాలను తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసి మంచి లాభాలను గడించవచ్చు.  భవిష్యత్తులో పుష్కలంగా నీరు దొరుకుతుందనే  అపోహలో ఉండకుండా  నీటి సంరక్షణ,  నీటి యజమాన్య పద్ధతులను పాటించడం, పంట మార్పిడి, తక్కువ నీటితో సాగు,  సూక్ష్మ సేద్యం మొదలైన చర్యలను చేపట్టాలి.  నీటి కొరత లేకుండా సమస్త జీవుల మనుగడకు చర్యలు చేపట్టవలసిన సమయం ఆసన్నమైనది. 

- డా. ఎ. పోశాద్రి,  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం-