Marcus Stoinis: క్రికెట్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్కస్ స్టోయినిస్

Marcus Stoinis: క్రికెట్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్కస్ స్టోయినిస్

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ప్రపంచ క్రికెట్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ అవుతున్నట్టు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గురువారం (ఫిబ్రవరి 6) వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఫిబ్రవరి 19 నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా స్టోయినిస్ ఆడట్లేదని తేల్చి చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టులో స్టోయినిస్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు స్టోయినిస్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో ఆసక్తికరంగా మారింది. 

ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఇకపై కేవలం టీ20ల్లో మాత్రమే కనిపించనున్నాడు. తన కెరీర్ లో చివరి దశను ఆస్ట్రేలియా తరపున, ఫ్రాంచైజ్ టీ20 ఫార్మాట్‌కు అంకితం చేయాలనే  వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించానని స్టోయినిస్ అన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియా తరఫున వన్డే క్రికెట్ ఆడటం ఒక అద్భుతమైన ప్రయాణం. ఆసీస్ జెర్సీ ధరించినందుకు నేను అదృష్టవంతుడను. జట్టు తరపున ప్రతి మ్యాచ్ ఆస్వాదించాను. ఇది కఠిన నిర్ణయమే అయినప్పటికీ.. ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తో నాకు చక్కని అనుబంధం ఉంది" అని స్టోయినిస్ తెలిపాడు. 

2015లో ఇంగ్లాండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన స్టోయినిస్ 71 వన్డేలు ఆడాడు. 64 ఇన్నింగ్స్‌లలో 27 యావరేజ్ తో 1495 పరుగులు చేశాడు. తన అత్యధిక స్కోర్ 146 నాటౌట్. 2019 లో న్యూజిలాండ్ పై లోయర్ ఆర్డర్ సహాయంతో అతను ఆడిన 146 పరుగుల ఇన్నింగ్స్ వన్డే చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్. బౌలింగ్ లోనూ రాణించి 48 వికెట్లు పడగొట్టాడు. 35 ఏళ్ల ఈ స్పీడ్‌స్టర్ 2024న పెర్త్‌లో పాకిస్థాన్‌తో తన చివరి వన్డే ఆడాడు. 2023 ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.