
శివ ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అంటే ప్రకృతిలో దైవాఙ్ఞ లేకుండా ఏమీ జరగదని పురాణాల ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా పరమేశ్వరుడికి ఆఙ్ఞ లేకుండా 14 లోకాలలో కూడా ఏమీ జరగదు. అందుకే శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలధారణలు, విభూతి ధారణలు, జాగరణలు.. శివరాత్రి రోజు కళ్యాణాలు..ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. భక్తితో శ్రద్దగా.. చిత్తశుద్దితో చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు
పూర్వకాలంలో అందరూ వారి కుల వృత్తులపై ఆధారపడి జీవించేవారు. ఎవరు ఏ కులంలో పుట్టాలి.. అనే విషయం గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా.. నిర్దారణ జరుగుతుంది. ఎవరైనా సరే తెలిసో.. తెలియకో.. దైవ ప్రార్థన కాని.. పూజ కాని చేస్తే తప్పక ఫలితం ఉంటుందని పరమేశ్వరుడు.. పార్వతిమాతకు వివరించాడు. పూర్వం ఓ బోయవాడు వృత్తి రీత్యా అడవికి జంతువులను వేటాడేందుకు వెళ్లాడు. బోయవారి వృత్తి వేటాడటం. అయితే ఓ రోజు ఆ బోయవానికి వేటాడేందుకు ఎలాంటి జంతువు కనపడలేదు. ఇక చేసేదేమీ లేక నిరాశతో ఇంటి దారి పట్టాడు.
అలా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఓ సరస్సు కనపడింది. అయితే ఇక్కడకు నీళ్లు తాగేందుకు ఏదైనా జంతువు వస్తుందని... దానిని వేటాడవచ్చని .. అక్కడ ఉన్న చెట్టుపై బాణాన్ని ఎక్కుపెట్టి కూర్చున్నాడు. ఆ బోయవానికి శివ .. శివ.. అనడం ఊతపదంగా అలవాటు. ఆ పదానికి ఎంత శక్తి ఉంటుందో అతనికి తెలియదు. కాని ప్రతిసారి శివ..శివ అంటుంటాడు. చెట్టుపై నుంచి చూస్తే సరస్సు దగ్గరకు వచ్చే జంతువులు కనపడేలా.. చెట్టుకు ఉన్న ఆకులు.. కొమ్ములు విరిచి కిందపడేశాడు.
ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా.. జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మమంటూ, ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది. మాములుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేకవదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా.. తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరికాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగివస్తానని వేడుకొంది. మొదటి జింక కూడా ఇలాగే పలికే సరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు.
ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగ జింక కూడా మానవభాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఓ సారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్లింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు వేటగాడు.
ఇంతలో మరోక జింక.. దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటివరకు ఆగమని పలికి చెప్పి వెళ్లింది. మరికొద్ది సేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది.
అయితే ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివ నామస్మరణం చేయడం, తన చూపునకు అడ్డువచ్చిన మారేడు ఆకులు కోసి కిందపడేటం చేశాడు. ఆ చెట్టుకిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజా ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది.
బోయవాడు క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ఠ అతడిని పూర్తిగా మార్చి వేసింది. ఆరోజు శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడు. జింకలు తమ సత్యనిష్ఠతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు.