
- సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఘటన
కొండాపూర్, వెలుగు : ఆస్తి కోసం అత్తను ఓకోడలు చంపింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో ఈ ఘటన జరిగింది. సీఐ చంద్రయ్య కథనం ప్రకారం మారేపల్లికి చెందిన ఎర్రోళ్ల నర్సింహ గౌడ్ కు ఊరి శివారులో మూడున్నర ఎకరాల భూమి ఉంది. తన కూతురు, కొడుకు పెండ్లి కోసం ఆయన రెండున్నర ఎకరాలు అమ్మాడు. ఎకరా భూమిని కౌలుకిచ్చి వచ్చిన డబ్బుతో భార్య తుల్జమ్మ (60) తో కలిసి ఊరిలోనే ఉంటున్నాడు.
ఎకరా భూమి కోసం నర్సింహా కొడుకు సాయి కుమార్తో ఆయన భార్య మంజుల గొడవపడుతున్నది. ఇది భరించలేక సాయి కుమార్ భార్యతో కలిసి రెండేండ్ల కింద మునిపల్లి మండలం అంతారం వెళ్లి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. అక్కడే కల్లు వ్యాపారం చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సామాన్లు సర్దుకొని మళ్లీ ఊరికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం అత్త తుల్జమ్మతో కోడలు మంజుల భూమి విషయంపై గొడవకు దిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సింహా ఇంటికి వచ్చేసరికి తుల్జమ్మ చనిపోయి ఉంది.
మెడపై చేతి గోర్ల గుర్తులు ఉన్నాయని, తన భార్య మంజుల హత్య చేసిందని పోలీసులకు సాయి కుమార్ ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.