
వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 744కిలోల గంజాయి అధికారులకు పట్టుబడింది. ఏపీ నుంచి హైదరాబాద్ కు భారీగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు శనివారం రాజేంద్రనగర్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. కలప లోడ్‌తో అనకాపల్లి నుంచి బయల్దేరిన ట్రక్కును గుర్తించి సోదాలు చేయగా కలప మధ్య ప్లాస్టిక్ సంచుల్లో గంజాయిని గుర్తించారు. డ్రైవర్ ను అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ట్రక్కు యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అధికారుల కళ్లుగప్పి కలప దుంగల్లో అక్రమంగా తరలిస్తున్న వీరి వెనక ఇంకెంతమంది ముఠా సభ్యుల హస్తం ఉందోనని ఆరా తీస్తున్నారు. కొద్ది రోజులుగా విశాఖ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హైదరాబాద్, జహీరాబాద్ కు తరలిస్తున్నట్లు గుర్తించామని, వారంలో వెయ్యి కిలోల గంజాయిని పట్టుబడిందని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు.