
- కామారెడ్డి జిల్లాలో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు
- 15 రోజుల్లో 5 కేసులు నమోదు
- చైన్ సిస్టమ్ లో అమ్మకాలు
ఓ యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొద్ది రోజులుగా కొందరు యువకులతో కలిసి గంజాయి మత్తుకు అలవాటు పడ్డాడు. గంజాయి తాగుతూ పోలీసులకు చిక్కాడు.. జిల్లా కేంద్రానికి 10 కి.మీ. దూరంలోని ఓ గ్రామానికి చెందిన మరో యువకుడు ఇంటర్ చదివాడు. గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకునే వాడు. గంజాయి మత్తు కు అలవాటు పడ్డాడు..
కామారెడ్డి, వెలుగు : యువతే టార్గెట్‌గా జిల్లాలో గంజాయి దందా జోరుగా సాగుతున్నది. యూత్ టార్గెట్ గా అమ్మకాలు యథేచ్ఛగా సాగుతుండగా, 15 రోజుల వ్యవధిలోనే ఐదు కేసులు నమోదయ్యాయి. పట్టుబడినవారిలో గంజాయి సప్లయ్‌తో పాటు, సేవించేవారు ఉన్నారు. పట్టణాలకే కాకుండా పల్లెలకు గంజాయి మహమ్మారి విస్తరించింది. ఒకరి నుంచి ఇంకొకరికి చైన్ సిస్టమ్‌గా యువకులకు గంజాయి చేరుతోంది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువకులు మత్తుకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిస కావొద్దని పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోగా, ఈ దందా రోజురోజుకూ పెరుగుతున్నది.
శివారు ప్రాంతాలే అడ్డాగా ..
జిల్లా కేంద్రంతో పాటు, గ్రామాల శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని గంజాయి దందా సాగిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు కూడళ్లలోనూ మత్తు పదార్థాలను అమ్ముతున్నారు. పాన్ షాపులు, హోటళ్లు, కల్లు బట్టీల వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని దేవునిపల్లి, లింగాపూర్, చిన్నమల్లారెడ్డి, టెకిర్యాల్ శివారుల్లోని నిర్జన ప్రదేశాల్లో ఎక్కువగా గంజాయి తాగుతున్నట్లు తెలుస్తోంది.
పలువురు యువకులకు సెల్ఫోన్ల ద్వారా ఆయా ఏరియా అడ్రసులు, సప్లయ్ దారులు చెప్పగానే ఒకరి నుంచి మరొకరికి సమాచారం చేరవేసుకొని శివారు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఐదుగురి నుంచి 10 మందికి పైగా ఒక చోటకు చేరగానే గంజాయిని సప్లయ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎండు గంజాయి, లిక్విడ్ గంజాయి సప్లయ్ చేస్తున్నారు. సిగరేట్‌లో కూడా పెట్టి ఇస్తున్నట్లు సమాచారం. ఏడాది క్రితం కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులోని ఓ ఫామ్ హోస్లో పలువురు యువకులు లిక్విడ్ గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కారు. జిల్లా కేంద్రంతో పాటు, గాంధారి, భిక్కనూరు ఏరియాల్లో నుంచి గంజాయి సప్లయ్ జరుగుతోంది.
జిల్లాలో ఇటీవల కేసులు ..
ఈ నెల 17న కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఇల్చిపూర్ శివారులో పోలీసులు వెహికిల్స్ తనిఖీలు చేస్తుండగా గంజాయి సప్లయ్, తాగే ఐదుగురు యువకులు పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 445 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న భిక్కనూరు మండలంలోని నాలుగు గ్రామాల్లో 8 మంది యువకులు గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికారు. 6న బిచ్ కుంద మండలంలో ఓ యువకుడిని అరెస్టు చేసి, 154 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4న కామారెడ్డి టౌన్లో గంజాయి అమ్ముతున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి వారి నుంచి 380 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
అసలు సప్లయ్ దారులు ఏవరు..?
జిల్లాకు మహారాష్ర్ట, ఏపీ నుంచి గంజాయి సప్లయ్ జరుగుతున్నది. వెహికిల్స్, రైళ్లలో గంజాయిని తీసుకొచ్చి సప్లయ్ చేసి వెళ్తున్నారు. పోలీసులు ఇక్కడ సప్లయ్ చేస్తున్న వారిని, సేవిస్తున్న వారిని మాత్రమే పట్టుకొని అరెస్టు చేస్తున్నారు. ఇక్కడకు గంజాయి సప్లయ్ చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టడం లేదు. ఇప్పటికైనా నిఘా పెంచి గంజాయి దందాను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది.
గంజాయి అమ్మకాలపై నిఘా పెంచాం..
గంజాయి అమ్మకాలను కట్టడి చేసేందుకు కామారెడ్డి ఏరియాలో నిఘా పెంచాం. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసి కేసులు నమెదు చేశాం. గంజాయి తాగే ఏరియాలను గుర్తించి పోలీసులతో పెట్రోలింగ్ చేస్తున్నాం. గతంలో గంజాయి సప్లయ్ చేస్తూ అరెస్టు అయిన వారిని కూడా ఎంక్వైరీ చేశాం. మత్తు పదార్థాల సప్లయ్ ముఠాల చైన్ సిస్టమ్‌ను ఛేదిస్తున్నాం.
బి. చైతన్యారెడ్డి, ఏఎస్పీ, కామారెడ్డి